తిరువూరు పట్టణంలో యువతరం గతంలో ఎన్నడూ లేనివిధంగా చెడువ్యసనాలకు బానిసలవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. తిరువూరు బైపాస్‌రోడ్డు వ్యసనాలకు బానిసలవుతున్న యువకులకు, విద్యార్థులకు అడ్డాగా మారుతోంది. రియల్ఎస్టేట్ వెంచర్లలో, బైపాస్‌రోడ్డుకు ఇరువైపులా ఉన్న కొన్ని నిర్జన ప్రదేశాల్లోనూ పోకిరీలు చట్టవిరుద్ధ కార్యక్రమాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోకిలంపాడు వెళ్లే రహదారిలోనూ, తండాకి వెళ్లే రహదారిలోనూ ఉన్న రియల్ఎస్టేట్ వెంచర్లలో పనీపాట లేని యువకులు పెద్దసంఖ్యలో జేరి మత్తులో చిత్తవుతున్నారని సమాచారం. గతంలో ఎన్నడూ లేనివిధంగా సిగరెట్లలో గంజాయిని కూర్చుకుని, వాటిని పీలుస్తూ మత్తులోకంలో తేలియాడుతున్నట్లు సమాచారం. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పోలీసుల నిఘా వైఫల్యం వెరసి యువకులను, విద్యార్థులను స్వేచ్ఛగా వదిలేయడంతో రోజురోజుకూ మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడురోజుల క్రితం తిరువూరులో జరిగిన ఘర్షణల వెనుక కూడా ఈ మత్తుపదార్థాల ప్రభావం ఉన్నట్లు స్థానిక ఎమ్మెల్యే బహిరంగంగానే ఆరోపించారు. తిరువూరులో గంజాయి వంటి మత్తు పదార్థాలకు పోలీసుల వైఫల్యం మూలంగా యువకులు రోజురోజుకూ బానిసలు అవుతున్నారని ఎమ్మెల్యే రక్షణనిధి బహిరంగంగా ఆరోపించడంతో పరిస్థితి తీవ్రత వెల్లడయింది. యువతరం తీవ్రమైన మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు తెలుసుకున్న స్థానిక ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే తిరువూరులో శాంతిభద్రతలు కరువవుతాయని, యువతరం భవిష్యత్తు నాశనం అవుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. మత్తుకు బలి అవుతున్న వారిలో వైద్య, ఇంజినీరింగ్ ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తక్షణమే పోలీసులు స్పందించి తిరువూరు బైపాస్ రోడ్డులోని నిర్జన ప్రదేశాల్లో నిఘా పెట్టాలని, యువకులకు గంజాయి సరఫరా చేస్తున్న రాకెట్‌ను మట్టుబెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.