తిరువూరులో విద్యార్థుల మధ్య ఘర్షణలు. కత్తులతో పరస్పర దాడులు.
తిరువూరు పట్టణంలో ఇటీవల శాంతి భద్రతలు కరువవుతున్నాయి. పనీ పాటా లేకుండా రాత్రింబవళ్లు బజారుల వెంట తిరిగే యువకులు, విద్యార్థులు ముఠాలుగా ఏర్పడి మద్యానికి బానిసలై వీధుల్లో వర్గపోరాటాలకు దిగుతున్నారు. ఆదివారం రాత్రి తిరువూరు మసీదు సెంటరులో ఇరువర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ కత్తులతో దాడులు చేసుకోవడం వరకు వెళ్లింది. రాయపూడి వినయభార్గవ్, బాబీలతో పాటు వారి అనుచరులు నిఖిల్, షేక్ రషీద్‌లు ప్రత్యర్థి వర్గంపై దాడిచేశారు. పోలీసులు ఇరువర్గాల మీద కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు స్థానిక పోలీసు స్టేషనులో ఇచ్చిన ఫిర్యాదును ఈ దిగువ ఇస్తున్నాము. గాయపడిన వారిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. తిరువూరులో ఇటీవల పోకిరీల బెడద ఎక్కువైందని తరచుగా వీరు ఘర్షణలకు దిగుతున్నారని, వీరిపై గట్టి నిఘా ఉంచి ఇటువంటి అల్లర్లు పునరావృతం కాకుండా తగుచర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.