నూతన రాష్ట్రం త్వరితంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడుతుంటే దిగువ స్థాయిలో మాత్రం ఆ పార్టీ నేతలు రోజుకు పద్దెనిమిది గంటలపాటు అవినీతి,అక్రమాలకు పాల్పడుతూ తమకు తిరుగులేదనే విధంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు పరిపాలనను అపహాస్యం చేస్తున్నారు. దీనికి తిరువూరు నగర పంచాయితీలో జరుగుతున్న అవినీతి అక్రమాలే ప్రభల నిదర్శనం. ఇక్కడ జరుగుతున్న అవినీతి, అవకతవకలకు సాక్షాత్తూ నియోజకవర్గ కన్వీనర్ స్వామిదాసు వత్తాసు పలుకుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ నుండి మూడు సంవత్సరాల క్రితం నగర పంచాయతీగా మారిన తిరువూరులో ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్లు అందిన కాడికి దోచుకుంటూ, వర్గాలుగా విడిపోయి మున్సిపల్ పరిపాలను బజారుకీడ్చారు. గత మూడేళ్ళలో నలుగురు మున్సిపల్ కమీషనర్లను బదిలీ చేయించారు.
*** అభివృద్ధి పనుల్లో అక్రమాలు
నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుండి పట్టణంలో జరిగిన కోట్లాది రూపాయిల అభివృద్ధి పనుల్లో మున్సిపల్ కౌన్సిలర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డారు. బినామీల పేరుతో పనులు సొంతంగా చేసి ఎక్కడికక్కడ నిధులు దిగమింగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చేసిన అభివృద్ధి పనుల్లో అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నెలల క్రితమే వేసిన సిమెంటు రోడ్లు ప్రస్తుత వర్షాకాలంలో గుంటలు పడి లెగిసిపోతున్నాయి. డ్రయిన్ల నిర్మాణం లోపభూయిష్టంగానే ఉంది. తిరువూరు మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం కౌన్సిలర్లు అన్ని స్థాయిలలో పరిపాలనను భ్రష్ఠు పట్టించారు. తమ బంధువులను, సన్నిహితులను మున్సిపల్ సిబ్బందిగా నియమించుకున్నారు. అభివృద్దిలో పోటీ పడవలసిన అధికార పార్టీ కౌన్సిలర్లు మున్సిపల్ నిధులను కొల్లగొట్టడంలో సిద్ధహస్తులుగా మారారు. చైర్పర్సన్ మరకాల కృష్ణకుమారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని కొందరు కౌన్సిలర్ల వత్తాసుతో అధికారులు, సిబ్బంది వర్గాలుగా విడిపోయి నిధులు దిగమింగుతున్నారు. తిరువూరు మున్సిపాలిటీలో రూ.20లక్షల మేర సొమ్ము దుర్వినియోగం జరిగినట్లు బహిరంగంగా గత వారం రోజుల నుండి మీడియా కోడై కూస్తున్నప్పటికీ మున్సిపల్ ఉన్నతాధికారుల్లో చలనమే లేకుండా పోయింది.
*** అధ్వానంగా పారిశుద్ధ్యం
తిరువూరు పట్టణంలో ఏర్పడిన అధ్వాన్న పారిశుద్ధ్య పరిస్థితులు మున్సిపల్ పరిపాలనకు అద్దం పడుతున్నాయి. మురికి కాలువల్లో పూడికలు తీసే నాధుడే కరువయ్యాడు. దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రజలు వాటి బారినపడి విష జ్వరాలతో మృతిచెందుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. ప్రధాన రహదారుల్లో సైతం చెత్తకుప్పలు దర్శనమిస్తున్నాయి. సాక్షాత్తు రెవిన్యూ, పోలీస్, ట్రెజరీ, మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్ళే రహదారి వరద నీటిలో మురికి కూపంగా మారినప్పటికీ మున్సిపాలిటీకి కనీసం చీమకుట్టినట్లైనా లేదు. శానిటరీ ఇన్స్పెక్టర్ సురేష్‌కుమార్ పాలకవర్గంతో సఖ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. కమీషనరుకు సమాంతరంగా అయన స్వతంత్రంగా ఏకపక్షంగా విధులు నిర్వహిస్తున్నారని ఆయనను బదిలీ చేయాలని చైర్పర్సన్ కృష్ణకుమారి ఉన్నతాధికారులకు లేఖలు వ్రాసినప్పటికి స్పందించే నాథుడే కరువయ్యాడు. తనకు తెలియకుండా పాలకవర్గం చెత్త ఎత్తటానికి రెండు కొత్త మొబైల్ వ్యానులు కొనుగోలు చేయగా శానిటరీ ఇన్స్పెక్టర్ గత సంవత్సర కాలం నుండి ఆ కొత్త వ్యానులను ఉపయోగించకుండా మూలన పడేశారు. స్వామిదాస్ అండదండలతో శానిటరీ ఇన్స్పెక్టర్ తమను లెక్క చేయడం లేదని పాలకవర్గ సభ్యులతో పాటు అధికారులు, సిబ్బంది వాపోతున్నారు. తమ వార్డుల్లో ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను శానిటరీ ఇన్స్పెక్టర్ పట్టించుకోవడం లేదని పాలకవర్గ సభ్యులు వాపోతున్నారు. మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగంలో గత రెండేళ్లలో జరిగిన పనులలో కోట్లాది రూపాయిలు కుంభకోణం జరిగిందని వార్తలు వస్తున్నాయి.
*** దేశం కౌన్సిలర్లు వర్గాలుగా చీలిపోయి తన్నుకు చస్తున్నారు.
మరకాల కృష్ణకుమారిని చైర్పర్సన్ పదవి నుండి దించివేయాలని స్వామిదాస్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మెన్ తాళ్లూరి రామారావు వర్గం మాత్రం ఎంపీ కేశినేని నాని సహకారంతో కృష్ణకుమారి పదవిని కాపాడుతున్నారు. ఒకరిద్దరు తప్ప అధికార పార్టీ కౌన్సిలర్లంతా కృష్ణకుమారి చైర్‌పర్సన్‌గా ఉంటేనే తమ ఆటలు సాగుతాయని ఆమె రాజీనామా చేయకుండా మద్దతుగా నిలుస్తున్నారు. మొత్తమ్మీద తిరువూరు మున్సిపాలిటీలో ఏర్పడిన అవినీతి కంపు వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం విజయంపై గణనీయమైన ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణలు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటేనే మున్సిపాలిటీలో పరిస్థితులు మెరుగుపడతాయి. లేకుంటే నాలుగో సారి కూడా తిరువూరులో తెదేపా పరాజయం పాలుగాక తప్పదు. మరో నూతన దిగుమతి మొహం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉందని తెలుగుదేశం వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.—కిలారు ముద్దుకృష్ణ, సీనియర్ జర్నలిస్టు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.