చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 9 నియోజకవర్గాల్లోని 33 మండలాలకు ఈ పథకం రెండో దశ కింద నీరందుతుందన్నారు. దీనిద్వారా సుమారు 2లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టును స్థిరీకరించనున్నట్టు సీఎం చెప్పారు. ఏడాదిన్నరలో నీరు పారాలని గుత్తేదార్లను ఆదేశించారు. మొండిధైర్యం, శ్రమతోనే ఎన్ని కష్టాలు ఉన్నా ముందుకు సాగుతున్నానన్నారు. ప్రకృతిలో మనమంతా భాగమని, నీరు, చెట్టు, వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉందని చెప్పారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. రూ.3208 కోట్లతో చేపడుతున్న ఈ రెండో దశ పనులకు కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘చాలాసార్లు ఈ ప్రాంతానికి వచ్చా. నా జీవితంలో ప్రజల్లో ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు. జలసిరికి హారతి కార్యక్రమానికి నిన్ననే పిలుపునిచ్చా. మనమంతా ప్రకృతిలో భాగం. నీరు, చెట్టు, వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ. ఒకప్పుడు నీటి సమస్య లేదు. వంకలు, వాగులు, ఎక్కడచూసినా నీళ్లు ఉండేవి. కానీ, నేడు ఎక్కడా నీళ్లులేని పరిస్థితి. భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది. వర్షాలు పడటంలేదు. ఒక వేళ పడినా అతివృష్టి, అనావృష్టి. ఈ నేపథ్యంలో ప్రకృతిని మనమంతా సంరక్షించుకోవడం తక్షణావసరం.’మనమంతా దీపావళి, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలు చేసుకుంటాం. అలాగే మనకు ప్రాణాధారమైన ప్రకృతిని ఆరాధించేందుకు అంతా సమాయత్తం కావాలి. అన్ని పండుగలకు మిన్న జలసిరికి హారతి కార్యక్రమంలో అంతా భాగస్వాములు కావాలి. జలం మనందరికీ అవసరం. జీవితంలో వెలుగు కావాలన్నా, జీవన ప్రమాణాలు పెరగాలన్నా. మనిషి బతకాలన్నా నీరు కావాలి. ఆ విషయాన్ని మనం మరచిపోతున్నాం. కష్టాలు కొనితెచ్చుకుంటున్నాం. మన పెద్దలు నదులకు, చెట్లకు పూజలు చేసేవారు. ప్రకృతిని ఆరాధించారు. అందుకే 12 పెద్ద నదులు ఉంటే ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరాలు చేశారు. నేడు మనం కూడా అదే పనిచేస్తున్నాం. గోదావరికి నిత్య హారతి ఇస్తున్నాం. ఏడాదిలోపు పట్టిసీమను పూర్తిచేసి గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. పోలవరం మన రాష్ట్రానికి జీవనాడి. అందువల్ల దాన్ని పూర్తిచేయాలనే సంకల్పంతో ప్రతి సోమవారాన్ని పోలవారంగా మార్చుకున్నా. రైతులకు ఓ సవాల్ విసురుతున్నా. మా ప్రభుత్వం కంటే గొప్పగా ఎవరైనా రుణమాఫీ చేశారా? ఒక పని అనుకుంటే నేను వెంటనే ప్రారంభిస్తా. బెల్టుషాపులు నిర్వహించేవారిపై బెల్టు తీశా. ఇసుక దందాలు చేస్తే ఖబడ్దార్. సంక్షేమ పథకాల అమలులో వివక్ష అవసరంలేదు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తాం. ప్రజల కష్టాలకు నేను అండగా ఉంటా. రాష్ట్రాభివృద్ధి కోసం నాకు అంతా సహకరించండి’ అని అన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.