తిరువూరు తెలుగుదేశంలో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ కన్వీనర్ నల్లగట్ల స్వామిదాసుకు ఎసరు పెట్టడానికి తెరవెనుక ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయి. వీటిని గమనించకుండా స్వామిదాసు మాత్రం తనదైన దారిలో ఒంటెద్దు పోకడలు పోతున్నారు. పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న చర్యలను గమనించే పరిస్థితుల్లో స్వామిదాసు ఉన్నట్లు కనిపించడంలేదు. గత మూడు నెలల నుండి తిరువూరు తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు వెనుక అధిష్టానం హస్తం ఉందా? లేదా? అనే విషయం ఇంకా తేలలేదు. రాష్ట్ర మంత్రిగా నియమితులైన, స్థానికుడైన కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌తో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ వర్ల రామయ్య దృష్టి కూడా తిరువూరు మీద పడినట్లు సమాచారం. వారిరువురూ తిరువూరు పరిణామాలను ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న తమ వేగుల ద్వారా తెలుసుకుంటున్నారు. మూడు పర్యాయాలు పరాజయం పాలైన స్వామిదాసును ఈ సారి తిరువూరు నుండి దేశం అభ్యర్ధిగా తొలగిస్తారని…పార్టీలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కొందరు ఇటీవల పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు.
*** హవ్వా..! స్వామిదాసు వైకాపాలో చేరతారా?
స్వామిదాసు వైకాపాలో చేరతాను అంటే చిన్న పిల్లవాడు కూడా నమ్మడు! అటువంటిది సోషల్ మీడియాలో ఒక గాలి వార్త వస్తే దానిని స్వామిదాసుతో పాటు దేశం నేతలు భూతద్దంలో చూపించారు. నీతీ, నిజాయితీతో, పార్టీకి విధేయుడిగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రక్షణనిధిని కాదని స్వామిదాసును వైకాపాలోకి ఎందుకు తీసుకుంటారని ఆలోచన కూడా ఎవరికీ కలగకపోవడం విచారకరం. అధికార పార్టీలో ఉండి, పాడి కుండలాంటి నియోజకవర్గ దేశం కన్వీనర్ పోస్టును వదులుకుని వైకాపాలోకి చేరటానికి స్వామిదాసు ఏమన్నా అమాయకుడా!? ఇవి ఏవి గమనించకుండా పోలీస్‌స్టేషనులో కేసులంటూ స్వామిదాసు తదితరులు ఆడిన డ్రామా దేశం పార్టీ పరువు తీసింది. తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో స్వామిదాసుకు కౌన్సిలర్లకు మధ్య పరోక్ష యుద్ధం జరుగుతోంది. చైర్మన్ కృష్ణకుమారిని పదవి నుండి దింపడానికి స్వామిదాసు దంపతులు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. మంచి పేరు తెచ్చుకున్న మున్సిపల్ కమీషనర్ వీ.శ్రీనివాసరావును అర్ధాంతరంగా బదిలీ చేయించడంపై కౌన్సిలర్లతో పాటు తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వివాదాస్పదంగా ఉన్న అవినీతి పరులైన కొందరు మున్సిపల్ అధికారులను స్వామిదాసు రక్షిస్తున్నారని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. దీనితో పాటు తమ గ్రామాల్లో వార్డు సభ్యుడుగా గెలవలేని వాళ్లనును కూడా మండల పార్టీ నేతలుగా స్వామిదాసు ప్రోత్సహిస్తున్నారని ఆ పార్టీ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది.
*** మంత్రుల ముందు పోయిన పరువు
తిరువూరులో స్టేడియం నిర్మాణం స్వామిదాసుతో సహా దేశం నేతలకు చాలా ప్రతిష్ఠాత్మకమైనది. పెద్ద ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీని ప్రారంభోత్సవం రసాభాసగా ముగియటం స్వామిదాసు ప్రతిష్ఠకు మచ్చలాంటిది. ఓ పెద్ద కార్యక్రమం జరుగుతున్నపుడు ఐదొందల మంది కార్యకర్తలను కూడా పోగు చేయలేకపోవడం ఆ పార్టీ నేతల అసమర్థతకు నిదర్శనం. ఈ తప్పును కూడా స్వామిదాసుపైనే నెట్టేశారు. మంత్రి దేవినేని ఉమా బహిరంగంగానే తిరువూరులో పార్టీ పరిస్థితిపై వెలిబుచ్చిన ఆగ్రహం, నిరసన నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే స్వామిదసుకు వ్యతిరేకంగా తిరువూరు నియోజకవర్గంలో కొందరు దేశం నేతలు తెరవెనుక పావులు కదుపుతున్నారని స్పష్టమవుతోంది. స్వామిదాసు ఎప్పటికప్పుడు వీటిని గమనించి ఎత్తులకు పైఎత్తులు వేసి తన స్థానాన్ని పదిలం చేసుకోకపొతే రాజకీయంగా ‘చిత్తు’ కాక తప్పదు.—కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.