• చంద్రబాబు ప్రకటించిన నవ నిర్మాణ దీక్షలు తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. పార్టీ సీనియర్ నాయకుడు ఓర్లా రామయ్యను ఈ దీక్షలను దిగ్విజయం చేయడానికి సమన్వయకర్తగా పార్టీ నియమించింది. ఈ దిక్షల ఉద్దేశం అర్ధం గాక పార్టీ కార్యకర్తలు, అధికారులు సణుగుకుంటూనే ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
• తిరువూరు సిఐగా నియమితులైన సత్యనారాయణ పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టారు.
• తిరువూరు మండల పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యవర్గాలను ఇంకా అధిష్టానం ప్రకటించకపోవడంతో ఆ పదవులను ఆశిస్తున్న పార్టీ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నారు.
• తిరువూరు మున్సిపాలిటిలో మూడు కుర్చీలాట ముమ్మరంగా సాగుతోంది. అధికారులు ఎవ్వరూ కూడా చైర్మన్‌కు, కౌన్సిలర్లకు సహకరించడం లేదు. దీంతో చిర్రెత్తిన కౌన్సిలర్లు అందరూ ఏకమయి కార్యాలయంలో చక్రం తిప్పుతున్న కామేష్ అనే ఉద్యోగిని తక్షణమే బదిలీ చేయాలని తీర్మానించారు. అతను జరుపుతున్న అవినీతి అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
• తిరువూరు మున్సిపల్ కమిషనరుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న బి.శ్రీనివాసరావును సంవత్సరం తిరగకుండానే బదిలీ చేయడం పట్ల చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. తమ కార్యాలయంలో జరిగే పాలనాపరమైన విషయాల్లో నియోజకవర్గ ఇన్చార్జి స్వామిదాస్ వేలు పెడుతున్నారని కామేష్ మాటలు విని శ్రీనివాసరావును స్వామిదాస్ బదిలీ చేయిఒచారని కౌన్సిలర్లు మండిపడుతున్నారు. దీనికి నిరసనగానే కౌన్సిలర్లు అంతా ఏకమై కామేష్ పై బదిలీ వేటు వేయాలని మూకుమ్మడిగా తీర్మానించినట్లు సమాచారం.
• మున్సిపల్ తదుపరి సమావేశంలో శానిటరి ఇన్స్పెక్టర్ సురేష్‌కుమార్‌ను ఓ పట్టు పట్టాలని కౌన్సిలర్లు భావిస్తున్నట్లు సమాచారం. పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉన్నప్పటికీ స్వామిదాస్ శానిటరీ ఇన్స్పెక్టరును వెనకేసుకొస్తున్నారని ఆయన అండ చూసుకుని చైర్మన్‌ను, కౌన్సిలర్లను లెక్క చేయడం లేదని ప్రజలతో కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ దురుసుగా వ్యవహరిస్తున్నారని కౌన్సిలర్లు ఆరోపిస్తున్నారు.
• తిరువూరు మండల పరిషత్‌లో జరుగుతున్న ఇసుక దందా పైన గతంలో పనిచేసిన ఇరువురు ఉద్యోగులు దిగమింగిన ఇసుక సినరైజ్ సొమ్ము రూ. 33 లక్షల రూపాయల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి లోకేష్‌కు ఫిర్యాదు చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం.
• తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం కె.రక్షణనిది మూడేళ్ళ తరువాత నిర్వహించిన వైకాపా నియోజకవర్గ స్థాయి సమావేశం కొంత ఉత్సాహంగానే జరిగినప్పటికీ గ్రామస్థాయి నాయకుల అభిప్రాయాలను తీసుకోలేదని ఆ పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీని పటిష్టవంతం చేసే విషయంపై చర్చించకుండా తెలుగుదేశం నేతలపైన ఆరోపణలు చేయడానికే సమయాన్ని అంతా కేటాయించారని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.
• జూన్ మొదటి వారం పూర్తి అవుతున్నప్పటికీ పట్టణంలో తీవ్రంగా ఎండలు, వడగాలులు విస్తున్నాయి. మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నప్పటికీ మొక్కుబడిగానే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని ఈ ట్యాంకర్లను పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
• తిరువూరు ఆర్టీసి బస్టాండులో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. సర్వీసులను మెరుగుపరిచే విషయంలో అధికార పార్టీ నాయకులు శ్రద్ధ తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
• తిరువూరులో ఈ పర్యాయం మొత్తం ఏడు మద్యం దుకాణాలు కొత్తగా మంజూరు అయ్యాయి. వీటికి లైసెన్స్ పొందిన యజమానులు వారం రోజుల వ్యవధిలో వీటిని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.