తిరువూరు వైకాపా నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, నాయకుల సమావేశం చాలా సంవత్సరాల తర్వాత గురువారం నాడు స్థానిక లక్ష్మీనారాయణ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఎమ్మెల్యే రక్షణనిధి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. తిరువూరులో గతంలో ఎన్నడు లేని విధంగా కొందరు తెదేపా నాయకులు పలు అక్రమాలకు పాల్పడుతూ పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారని తెలుగుదేశం హయాంలో తిరువూరులో అవినీతి పరాకాష్ఠకు చేరిందని దీనిపై తక్షణమే విచారణ జరిపించాలని సమావేశంలో తీర్మానించారు. తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో నీరు-చెట్టు కార్యక్రమం కింద రెండు కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని పనులు చేయకుండానే చేసినట్లుగా బిల్లులు చేసుకుని అధికారులు, ప్రజాప్రతినిధులు కుమ్మక్కై దోచుకుతిన్నారని సమావేశంలో పలువురు నేతలు ఆరోపించారు. తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో ఇసుక సినరేజ్ కింద వసూలు చేసిన రూ.33లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఇంతవరకు వాటిని ఖజానాకు జమ చేయలేదని దీనికి సంబంధించి బాధ్యత ఉన్న ఇరువురు ఉద్యోగులు పరారీలో ఉన్నారని ఆరోపించారు. తిరువూరు మున్సిపల్ కార్యాలయంలో అడ్డగోలుగా అవినీతి జరుగుతుందని వివిధ పథకాల కింద విడుదలైన దాదాపు రెండు కోట్ల రూపాయల గ్రాంటు దుర్వినియోగం అయిందని పలువురు వైకాపా నేతలు ఆరోపించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఇసుక అక్రమ రవాణ యథేచ్చగా జరుగుతోందని, అధికార పార్టీ నేతలు ప్రభుత్వ పథకాలను అడ్డం పెట్టుకుని అందిన కాడికి దోచుకుతింటున్నారని, వీటన్నింటిపై సమగ్ర విచారణ జరగాలని, పేదలకు అందవలసిన పథకాలు గద్దల్లా తెదేపా నేతలు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. తిరువూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైకాపా నేతలపై జరుగుతున్న హత్యలను, దాడులను ఖండిస్తూ తీర్మానించారు. వైకాపా నేతలపై అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తిరువూరు పట్టణంలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేక ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైకాపా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప అప్పారావు, ఆ పార్టీ జిల్లా నాయకులు సామినేని ఉదయభాను, బెల్లంపల్లి శ్రీనివాస్, జోగి రమేష్, జ్ఞానమణితో పాటు తిరువూరు నియోజకవర్గ పార్టీ నాయకులు మద్దిరెడ్డి సూరిరెడ్డి, గజ్జల సీతారామయ్య, శీలం నాగనర్సిరెడ్డి, చెలమాల సత్యం, బి.లోకేశ్వరరెడ్డి, చావా వెంకటేశ్వరరావు, పాలెం ఆంజనేయులు, భూక్యా గనియా, భూక్యా రాణి తదితరులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.