*విశాఖలో జరిగే తెదేపా మహానాడుకి మగవాళ్ళు అంతా తరలివెళ్ళారు. మహిళా ప్రతినిధులు మరకాల కృష్ణకుమారి , నల్లగట్ల సుధారాణి, కిలారు విజయబిందు తిరువూరులోనే ఉండి అన్నగారి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు.
* ఇది బదిలీల సమయం చాలా మంది అధికారులు ,. సిబ్బంది వెళ్ళిపోతున్నారు. మరికొందరు తిరువూరుకు వస్తున్నారు. ఆర్ డబ్య్లు ఎస్ , పంచాయతి రాజ్ . రెవెన్యు,. మున్సిపల్ శాఖలలో బదిలీలు జరిగాయి. మరికొన్ని జరగబోతున్నాయి.
*గత మూడు నెలలుగా ఖాళీగా ఉన్న పోలీసు సిఐ పోస్టు ఎట్టకేలకు భర్తీ అవుతుంది. తిరువూరులో శాంతి భద్రతలను ,ఇతర కార్యకలాపాల్లోను ఇరగదీశారని అప్పటి సిఐ కిషోర్ బాబుకు మంచి పేరు ఉండేది. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారో తెలియలేదు. తిరువూరు సిఐగా నెలరోజుల క్రితమే నందిగామ నుండి బదిలీ పై వచ్చిన సత్యనారాయణ శిక్షణతో పాటు ఇతర కార్యక్రమాలు ముగించుకుని ముప్పైవ తేదీ నుండి తిరువురులోనే పూర్తీ స్థాయిలోనే ఉంటారని సమాచారం.
*తిరువూరు తహసిల్దార్ బాలకృష్ణా రెడ్డి బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు,
* ప్రస్తుతం గ్రామీణ ఎస్సై గా ఉన్న సురేష్ ను పట్టణ ఎస్సైగా అదనపు బాద్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు కుడా త్వరలో బదిలీ ఉత్తర్వులు వస్తాయని సమాచారం.
*తిరువూరు మండల పరిషత్ సుపర్నేంట్ గా ఉన్న వీరమాచినేని వరప్రసాద్గ తమూడేళ్ళ నుండి ఇన్ చార్జి ఎండీవో పోస్టును చాలా సమర్దవంతంగా నిర్వహిస్తున్నారంట!?. వీరి సేవలు గుర్తించి ఇటీవల అవార్డు కూడా ఇచ్చారంట.! ఇటువంటి ఎండీవో జిల్లలో ఎక్కడా లేడని ఈయన్నే కోనసాగించాలని మండల పరిషత్ అద్యక్షుడు గద్దె వెంకన్న చేసిన సిఫారసును జడ్పీ చైర్ప ర్సన్ గద్దె అనురాధ ఆమోదించారట ! ఇటీవల జిల్లాలో చాలా మంది ఎండీవోలను బదిలీ చేసినప్పటికీ తిరువురు ఎండీవో పోస్టు మాత్రం భర్తీ చేయకపోవడంపట్ల అంతర్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావట్లేదు.
*తిరువూరు మండల పరిషత్ లో ఉన్న దాదాపు పదిహేను మంది ఎంపీటీసీ సభ్యులకు పది నెలల నుండి గౌరవ వేతనాలు అందకపోవడంతో వారు లబోదిబో అంటున్నారు.
*మండల పరిషత్ కార్యాలయంలో అడిగిన వారందరికి ఇసుక పరిమిట్లు తగిన ముడుపులు ఇస్తే కాదనకుండా జారీ చేస్తున్నారంట. ఒక్క పరిమిట్ కు ఒక ట్రిప్పు ఇసుక తోలుకోవచ్చి ఉండగా పది ట్రిప్పులకు పైగా తోలుకుంటూన్నారంట!.
*మండలంలో చిన్న చిన్న గృహ యజమానులకు ఇసుక కావాలంటే భారీగా కష్టపడాల్సి వస్తుంది. పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లకు మాత్రం రోజుకు వంద ట్రిప్పులు చొప్పున గానుగపాడు, చింతలపాడు రేవుల నుండి అక్రమంగా ఇసుక తరలి వెళ్తున్నప్పటికి పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
* ఇక మున్సిపల్ కార్యాలయం విషయానికి వస్తే అక్కడి చైర్మన్ మరకాల కృష్ణకుమారి తనకున్న అధికారాలను వినియోగించుకోలేక పోతున్నారు. ఆమెకు తెలియకుండానే కార్యాలయంలో చాలా పనులు చకచకా జరిగిపోతున్నాయి.
*ఒప్పందం ప్రకారం మున్సిపల్ చైర్మన్ పదవి నుండి కృష్ణకుమారి వైదొలగాల్సి ఉన్నప్పటికీ ఈ విషయంలో మాత్రం చాలా పట్టుదలగానే చైర్ పర్సన్ ఉన్నారు. పాపం పుణ్యం తెలియని కృష్ణకుమారి అయితేనే తమ ఆటలు సాగుతాయని చాలామంది కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ పరిస్థితుల్లో క్రిష్ణకుమారితో రాజీనామా చేయించడం స్వామిదాసు వల్ల కుడా కావటంలేదు. ఎంపీ కేశినేని నాని మద్దతు కృష్ణకుమారికి ఉండటం ఆమెకు కలసివచ్చింది.
*ఈ నేపద్యంలో కొద్ది నెలల క్రితమే తిరువూరు మున్సిపాల్టికి వచ్చిన కమిషనర్ వీ. శ్రీనివాసరావు బదిలీ పై వెళ్తున్నట్లు సమచారం.
*తిరువూరు నగర పంచాయతీలో ఉన్న కౌన్సిలర్లు సొంత కంట్రాక్టుల పై చూపుతున్న శ్రద్ద నగరంలో పారిశుద్యం మెరుగుదల పై చూపడం లేదని పారిశుధ్య సిబ్బంది పై అజమాయిషీ కొరవడిందని పట్టణ ప్రజలు నిరసన వ్యక్తపరుస్తున్నారు.
* తిరువూరు పట్టణం చుట్టూ ఏడు చెరువులు, మూడు వాగులు ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు గుక్కెడు తాగునీరు దొరకడం కష్టంగా ఉంది. ఇటీవలే తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదలకు మున్సిపాల్టిలో రూ. రెండు కోట్లు ఖర్చు పెట్టినప్పటికీ మూడు రోజులకు ఒక్కసారి కుడా పట్టణ ప్రజలకు తాగునీరు అందడం లేదు.
*గతమూడేళ్ళ నుండి తిరువూరు మున్సిపల్ కార్యాలయం భవన నిర్మాణం నత్తనడకన సాగుతోంది. కాంట్రాక్ట ర్ మున్సిపల్ అధికారులకు కనిపించడం లేదంట!. “మీ భవనాన్ని మీరే నిర్మించుకోలేరు.. మాకు సౌకర్యాలు లేమి కల్పిస్తారని” మున్సిపల్ అధికారుల పైన పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.
*మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ చాలా కాలం తరువాత ఆదివారం, తిరువురును సందర్శించారు. గతంలో తనకు అనుచరులుగా ఉన్న నాయకుల ఇళ్ళకు వెళ్లారు. ఆ గృహాలలో వివాహమైన వధూవరులను ఆశీర్వదించారు. బంధువులు మరణించిన చోట పరామర్శలు చేశారు. చాలా మంది స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన పర్యటనలో పాల్గొని ప్రస్తుతం తమకు ఏమి పనిలేదని తక్షణమే రాజకీయాల్లోకి రావాలని లగడపాటిని కోరినట్లు సమాచారం.
* తిరువూరులో రాజకీయ పితామహుడు కాంగ్రెస్ కురువృద్దుడు కంచి రామారావు ప్రస్తుతం ఊగిసలాటలో ఉన్నారు. తెలుగుదేశం లోకి వెళ్దామా? లేక యధావిదిగానే ఉండి గౌరవాన్ని కాపాడుకుందామా? అని ఆలోచనలో నిమగ్నమై ఉన్నారు.
*ఎక్స్సైజ్ శాఖామంత్రి జవహర్ స్వగ్రామం తిరువూరు మండలమే కావటంతో ఇక్కడ ఉన్న ఎక్సైజ్ శాఖను అదునీకరిస్తున్నారు.
* పట్టణ తెలుగుదేశం అద్యక్ష పదవి ఎవరికీ లభిస్తుందనే విషయం పై తీవ్రమైన ఉత్కంట అవర్గాల్లో నేలకుని ఉంది. సీనియర్ నాయకుడు బాల్ టాక్రే .(బొబ్బ కుమార్ ) కు ఈపదవి వస్తుందని చాలా మంది అంటున్నప్పటికీ బొమ్మసాని మహేష్‌కు ఈ పదవి దక్కుతుందని తాళ్లూరి రామారావు వర్గం తెగ ప్రచారం చేస్తోంది.
*తెలుగుదేశం పార్టీకి సీనీయర్ నేతలు క్రమేపి దూరమవుతున్నారు. క్రిమినల్‌కే సులో చిక్కుకుని, ముందస్తు బెయిల్ తెచ్చుకుని, “కోడిపందెల కింగ్ ”గా పిలవబడే ఒక సీనియర్ నాయకుడు ఇటీవల తన జోరు కాస్త తగ్గించారు.
*తిరువూరు పట్టణంలో ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన డా.సూరపనేని జయసింహను వార్డు కౌన్సిలర్ గా ఆ పార్టీ నేతలే ఓడించారు. దీనితో తత్త్వం బోదపడిన జయసింహ విజయవాడలోనే ఎక్కువగా ఉంటున్నారు. పార్టి కోసం ఖర్చుపెట్టింది అంతా సంపాదించుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు.
*అక్కపాలెంలో హత్యకు గురైన దళిత కాంగ్రెస్ నాయకుడు దోమతోటి నాగేశ్వరరావు దెయ్యమై తెలుగుదేశం నాయకులను పీడిస్తున్నాడు. ఈయన కేసు విచారణ ప్రస్తుతం సీబీ.సిఐడీ చేతుల్లో ఉంది, ఇప్పటికి మూడు సార్లుగా విచారణ పూర్తయింది. మండల తెలుగుదేశం పార్టికి చెందిన కీలక నేతలకు ఉచ్చు వేసి ఈకేసులో ముద్దాయిలుగా చేర్చడం కోసం కాంగ్రెస్స్ నాయకులు సాక్ష్యాలు సేకరించినట్లు
సమాచారం.
*తిరువూరు సుందరయ్య కాలనీ సమీపంలో నాల్ల నారాయణ హై స్కూల్ పేరుతొ జిల్లా పరిషత్ ఆద్వర్యంలో ఉన్న దాదాపు ఐదు కోట్ల రూపాయల భూమిని , భవనాన్ని కాజేయడానికి ఒక మండల స్థాయి అధికార పార్టీ నేత ప్రణాళికలు వేస్తున్నట్లు సమాచారం.
*తిరువూరు స్టేడియం నిర్మాణం పూర్తై సంవత్సరం కావస్తున్నా, దానిని ప్రారంబించే విషయంలో జరుగుతున్న తాత్సారం స్థానిక అధికార పార్టీ నేతల అసమర్ధతకు నిదర్సనంగా నిలుస్తుంది.
*రెండు జిల్లాల సరిహద్దుల్లో ఉన్న ఇటు తిరువూరు మండలంలోనూ అటు ఖమ్మం జిల్లా గ్రామాల్లోను మొబైల్ జూదం ముమ్మరంగా సాగుతున్నట్లు సమాచారం.
*తిరువూరులో పోలీసు అధికారులు, స్థానిక వ్యాపారస్తుల విరాళాలతో అట్టహాసంగా ఏర్పాటు చేసిన 34 సీసీ కెమెరాల్లో 16మాత్రమే పని చేస్తున్నాయి. తీవ్రమైన ఎండలకు..ఈదురు గాలులకు మిగిలిన కెమెరాల పరికరాలు, వైర్లు ధ్వంసమయ్యాయి .
*తిరువూరు ఆర్ అండ్ బీ ఏఈ రవిబాబు బదిలీ అయ్యారు. ఆర్ అండ్ బీ డీఈగా సంవత్సరం క్రితం వచ్చిన సత్యనారాయణ రెడ్డి తిరువూరు ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. అదనపు బాద్యతలతో ఆయన విజయవాడలో నే నివాసం ఉంటున్నారు.
*తిరువూరు స్థానిక శాసనసభ్యుడు రక్షణ నిధి తమకు పూర్తీ సమయం అందుబాటులో ఉండాలని సమస్యల పట్ల చురుకుగా వ్యవహరిచాలని.. అతిధిగా కాకుండా.. ప్రజాప్రతినిధిగా ఆయన వ్యవహరించాలని వైకాపా నాయకులూ.. కార్యకర్తలూ కోరుకుంటున్నారు.
*తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సుల నిర్వహణ అద్వానంగా ఉన్నప్పటికీ, రోజురోజుకు సర్వీసులను కుదిస్తున్నప్పటికి పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రయాణికులు వాపోతున్నారు.
*తిరువూరులో నూతనంగా నిర్మించిన రైతు బజారులో రాష్ట్రంలో ఎక్కడా లేని విదంగా కూరగాయల ధరలు చాలా తక్కువగా ఉన్నాయట !? నిజమైన రైతులే కూరగాయలు పండించటం మానివేసి ఇక్కడున్న సౌకర్యాలకు ముచ్చట పడి తమ కూరగాయలను అమ్ముకుంటున్నారట..! ఈ రైతు బజారును తిలకించటానికి మిగిలిన జిల్లాల నుండి రైతులను కూడా తీసుకు వచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందంట!?. దీనిలో వాస్తవం ఎంటోఈ రైతు బజారుకు వెళ్ళినపుడు పరిశీలించండి.
*తిరువూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ముస్లీం సోదరులు రంజాన్ వేడుకలు ప్రారంబించారు. చాలా మంది ఆదివారం తెల్లవారు జాము నుండి ఉపవాస దీక్షలు చేపట్టారు. వీరందరికీ tvrnews.com తరపున శుభాకాంక్షలు .
*మరికొన్ని తిరువూరు కబుర్లతో త్వరలో కలుసుకుందాం..అప్పటి వరకూ మన ‘వాట్సాప్’ గ్రూపును ఖాళీగా ఉంచకుండా కాస్త ప్రజలకు ఉపయోగపడే విషయా లను
మీరు కూడా దీనిలో షేర్ చేసుకొండి. గ్రూపు సభ్యులందరికీ అభినందనలతో––కిలారు ముద్దుకృష్ణ
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.