తిరువూరు పరిసర ప్రాంత ప్రజలు గత 30 ఏళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ మండు వేసవిలో సూర్యుడి తీవ్రతాకిడికి గురయ్యారు. మూడు రోజుల క్రితం తిరువూరులో 47.6 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఇక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇది ప్రపంచ స్థాయిలో అలజడికి కారణమైంది. ఎప్పుడూ రామగుండం, కొత్తగూడెం వంటి ప్రదేశాల్లోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతూ ఉంటాయి. ఈ సారి అక్కడి కన్నా అత్యధికంగా తిరువూరులో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కావడం పట్టణ ప్రజలకు ఆందోళన కలిగించింది. ఈ ఏడాది సాగర్ జలాలు తిరువూరు చుట్టు ఉన్న వాగులు, చెరువుల్లో కాస్తో కూస్తో ఉండటంతో మంచి నీటి ఎద్దడి నుండి ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఏప్రిల్ చివర్లో వాగులు, చెరువులకు సాగర్ జలాలు విడుదల కావడం అవి ఇప్పటికీ నిలిచి ఉండటంతో ప్రజలకు కొంత ఊరట కలిగింది. ఆ నీరే లేకపోతే చాలా బోర్లు, బావులు ఎండిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చేది.
*** భవిష్యత్‌పై హెచ్చరికలు
ఈ ఏడాది చూసిన రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు భవిష్యత్‌కు హెచ్చరిక లాంటివి. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో తిరువూరులో ఇంకా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పాటు మంచినీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. తిరువూరు ప్రజలను ఈ రెండు బాధల బారి నుండి కాపాడే బాధ్యత నగర పంచాయితి పైనే ఉంది.
*** ఏమేం చేయాలి
తిరువూరు పట్టణం చుట్టు ప్రక్కల ఉన్న ఏడు చెరువులను వేసవిలో నీరు నిల్వ ఉండే విధంగా ఇప్పటి నుండే ఏర్పాట్లు చేసుకోవాలి. తోకపల్లి వద్ద ఉన్న జంగంవారికుంటను వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా సాగర్ జలాలతో నింపాలి. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌గా ఈ చెరువును మలచాలి. తిరువూరును ఆనుకుని ఉన్న కట్టేలేరుపై చిన్న చిన్న చెక్ డ్యాంలను నిర్మించి నీరు నిల్వ ఉండేటట్లు చూడాలి. దీని మూలంగా బావులు, బోర్లలో నీటిమట్టాలు వేసవిలో కూడా అందుబాటులో ఉంటాయి. వేసవిలో పశువులకు ఈ నీరు ఉపయోగపడతాయి. ఉష్ణోగ్రతల నుండి ప్రజలు ఉపశమనం పొందాలంటే పచ్చదనం ఒక్కటే ఏకైక మార్గం. ప్రతి ఇంటిలో, ప్రతి వీధిలో మొక్కలు నాటే విధంగా వచ్చే వర్షాకాలం నుండే ఏర్పాట్లు చేయాలి. ప్రతి యేడు తూతూమంత్రంగానే వనమహోత్సవం అంటూ మొక్కలను నాటుతున్నట్లు ఫోటోలకు ఫోజులిస్తూ పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం తప్ప వాస్తవానికి తిరువూరులో పచ్చదనం అనేదే లేదు. తిరువూరులో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నగర పంచాయితితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు సవాలుగా తీసుకోవాలి. తిరువూరులో ఇంజనీరింగ్ కాలేజీతో పాటు దాదాపు వివిధ రకాలకు చెందిన 20 ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వీటిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో పట్టణాన్ని విభాగాలుగా చేసి మొక్కలను నాటించే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలి. నగర పంచాయితి, ప్రజా ప్రతినిధులు, విద్యా సంస్థలు, స్వచ్చంద సంస్థలు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని, కనీసం లక్ష మొక్కలు నాటగలిగితేనే తిరువూరు ప్రజలకు వచ్చే వేసవిలో కాస్త ఉపశమనం కలుగుతుంది. లేదంటే మీ ఆరోగ్యాలు ఆవిరి అయిపోతాయి. తస్మాత్ జాగ్రత్త!!!
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.