తిరువూరులో కొందరు ప్రజాప్రతినిధులు ప్రకృతి ప్రసాదించిన వనరులను పేదలకు అందుబాటులో లేకుండా దోచుకుతింటున్నారు. అధికార పార్టీ పేరు చెప్పి అడ్డగోలుగా కోట్లు కూడబెడుతున్నారు. జిల్లాలో విజయవాడ తరువాత ఇసుక మాఫియా తిరువూరులోనే భారీగా పడగ విప్పింది. తెలంగాణా సరిహద్దులో ఉండటంతో తిరువూరు నుండి ఇసుకు అక్రమ రవాణా చాలా సులభతరమవుతోంది. తిరువూరు, గంపలగూడెం మండలాల నుండి ప్రతినిత్యం వందలాది ట్రాక్టర్లు రాత్రింబవళ్లు సరిహద్దులో ఉన్న తెలంగాణాకు తరలిస్తున్నారు. తెలంగాణా సరిహద్దు గ్రామాల్లో నిల్వ చేసి హైదరాబాద్‌కు లక్షలాది రూపాయాలు అడ్డగోలుగా దోచుకుతింటున్నారు. సామాన్యుడు ఒక బాత్రూం కట్టుకోవాలన్నా, తన భవనానికి మరమ్మత్తు చేసుకోవాలన్నా ఒక ట్రాక్టర్ ఇసుక దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికినా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.2000ల వరకు వసూలు చేస్తున్నారు. గానుగపాడు, చింతలపాడు, ముష్టికుంట్ల, వాముకుంట్ల, వినగడప తదితర ప్రాంతాల్లోని కట్టలేరు, పడమటి వాగుల నుండి ఇసుక బహిరంగంగానే రవాణా అవుతున్నప్పటికీ అధికారులు మామూళ్ల మత్తులో మునిగి ఇసుక తరలిస్తున్న ప్రజా ప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. ఒక్క గానుగపాడు నుండే రోజుకు 50 ట్రాక్టర్లకు పైగా పొరుగునే ఉన్న ఖమ్మం జిల్లాకు తరలివెళ్తోంది. తిరువూరు పట్టణం సమీపంలోని కొన్ని ప్రాంతాల్లో ఇసుకను నిల్వ చేసి బహిరంగంగానే సరిహద్దుల్లో చెక్‌పోస్టులు దాటించి తరలిస్తున్నారు. పైగా అధికారుల నిఘా సరిగా లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణా తిరువూరు, గంపలగూడెం మండలాల్లో అడ్డగోలుగా సాగుతోంది.
*** కలెక్టర్ గారు…పట్టుకోండి చూద్దాం!
జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ బి.లక్ష్మికాంతం జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఉక్కు పాదంతో అణచివేస్తామని, అక్రమ రవాణాదారులపై పీడీ యాక్టులు ప్రయోగిస్తామని ప్రకటించారు. ఇసుక రవాణాపై 24 గంటల పాటు నిఘా ఉంచామని తెలిపారు. కలెక్టర్ ప్రకటన ప్రభావం తిరువూరులో ఏ మాత్రం పనిచేయడం లేదు. తిరువూరు ప్రాంతంలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించాలని సామాన్య మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలఒటే ఫోన్ నెంబర్లు: 0866-2474700, 2474701, 2474702.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.