తిరువూరులో గత నాలుగు దశాబ్దాల నుండి ప్రజా ప్రతినిధులుగా ఉంటున్నవారు పరాయి ప్రాంతం నుండి దిగుమతి అయి వచ్చిన వారు కావడంతో ఈ ప్రాంతం దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటున్నాయి. “అంగట్లో అన్నీ ఉన్నా– అల్లుడు నోట్లో శని” అన్నట్లుగా తిరువూరు చుట్టు ప్రక్కల అపారమైన జల వనరులు ఉన్నప్పటికీ తిరువూరు ప్రజలు మాత్రం గుక్కెడు మంచినీటి కోసం విలవిలలాడిపోతున్నారు. తిరువూరు పట్టణానికి నాలుగు వైపుల ఉన్న వాగులు, ఏడు చెరువులు ప్రస్తుత వేసవి సీజన్లో సైతం జలాలతో కళకళలాడుతున్నాయి. అయినప్పటికీ తిరువూరు ప్రజలకు బిందెడు మంచినీళ్లు కావాలంటే రెండు, మూడు రోజులు ఆగక తప్పడం లేదు.
*** ముందు చూపు ఉన్న జమీందారులు!!!
తిరువూరు పట్టణానికి, ఆ మాటకొస్తే మండలానికే ఘనమైన కీర్తి ఉంది. పలువురు జమీందార్లు ఈ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలించారు. (చరిత్ర గురించి తరువాత తెలుసుకుందాం). ఈ జమీందారులు చాలా ముందుచూపుతో వందల సంవత్సరాల క్రితమే తిరువూరు చుట్టూ 7చెరువులను తవ్వించారు. వేసవికాలంలో ఇబ్బంది లేకుండా 7చోట్ల పెద్ద పెద్ద బావులను కూడా తవ్వించారు ఆ మహానుభావులు. కానీ మన కొద్దిబుద్ధుల పెద్దల ఘనకార్యం పుణ్యమా అని పెద్దబావిని పూడ్చివేసి రైతుబజారు పెట్టారు. జైబావిని పూడ్చివేసి ఆటోస్టాండ్ పెట్టారు. గరల్స్ హైస్కూల్ వెనుక ఉన్న పెదబావిని పూడ్చి కోర్టును నిర్మించారు. మిగిలిన బావులు కూడా వీటి అదృశ్యం మూలంగా బెంగపడి ఏనాడో కనుమరుగయ్యాయి. తిరువూరుకు చుట్టూ కట్టేలేరు, పడమటి వాగులతో కలిపి ఇతర చిన్నవాగులు ఉన్నాయి. సాగర్ ప్రధాన కాలువ మనకు సమీపంలోనే ఉంది. ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంలో తిరువూరును పాలించిన పాలకులకు ముందుచూపు లేకపోవడంతో నేడు తిరువూరు పట్టణానికి మంచినీటి ఎద్దడి విపరీతంగా దాపురించింది. రాష్ట్రంలో ఏ పట్టణానికి చుట్టూ ఇన్ని చెరువులు కానీ, ఇన్ని వాగులు కానీ లేవు. వాస్తవానికి ఈ వనరులను సద్వినియోగం చేసుకుంటే తిరువూరు ప్రజలకు ప్రతిరోజూ ఒక పూట కాదు, రెండు పూటలు కూడా నీరు అందించవచ్చు. మహానుభావుడు, మాజీ కేంద్ర మంత్రి డా.కె.ఎల్.రావు ఏడు చెరువులను కలిపే రాకెట్ సప్లై ఛానల్‌ను, కోకిలంపాడు వద్ద కట్టలేరును ఏనాడో నిర్మించడం తిరువూరు ప్రజలకు వరం వంటిది.
*** కోనేరు ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరు అయింది!!!
కోనేరు రంగారావు పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తిరువూరుకు ప్రతినిత్యం మంచి నీరు ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే కోట్లాది ఖర్చుతో ఆయన చేపట్టిన ప్రాజెక్ట్ నేడు నిస్సారంగా పడి ఉంది. తిరువూరు ప్రక్కనే ఉన్న సాగర్ జలాలను నాడు కోనేరు పెట్టిన ఖర్చులో నాలుగవ వంతు పెట్టి ఉంటే ఈ ఏడు చెరువులకు, వాగులకు నీరు మళ్లించడం సునాయాసంగా ఉండేది. కానీ కోనేరు రంగారావు నాడు అనుభవం లేని అధికారుల మాటే విన్నారు. 25 కి.మీ. దూరంలో ఉన్న తెల్లదేవరపల్లి వద్దకు సాగర్ జలాలను పంపించి అక్కడ ఒక రిజర్వాయిర్‌ను తవ్వి తిరువూరుకు మంచినీరు అందించాలనేది కోనేరు కోరిక. సీనియర్ జర్నలిస్టుగా నేను, అనుభవం ఉన్న పలువురు అప్పట్లో కోనేరుతో ఈ పథకం ప్రయోజనం లేనిదని చెప్పినప్పటికీ ఆయన వినేవారు కాదు. ఎట్టకేలకు ఈ పథకం అనుకున్నట్లుగానే పూర్తి అయింది. తెల్లదేవరపల్లి నుండి తిరువూరు వరకు వేసిన పైపులు భుగర్భంలోనే ఉండిపోయాయి. అక్కడక్కడ వేసిన ట్యాంక్‌లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. తిరువూరు ప్రజలకు ఎప్పటిలానే మంచి నీటి కష్టాలు మంచి స్నేహితుడిలా అంటిపెట్టుకుని ఉన్నాయి.
*** తిరువూరుకు కృష్ణా జలాలంట!!!
ఇది ఒక అత్యద్భుతమైన తుగ్లక్ ఆలోచన. రూ.100 కోట్లు పెట్టి తిరువూరుకు కృష్ణా జలాలను తీసుకురావడం శుద్ధ దండగ. రూ.10 కోట్లు ఖర్చు పెడితే అవే కృష్ణా జలాలను తిరువూరుకు ఇవ్వవచ్చు. మన పక్కన ఉండే సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. మన చుట్టూ ఉన్న వాగుల్లో నీరంతా కృష్ణా నదిలోకే వెళ్తోంది. మైలవరం, నూజివీడు వంటి ప్రాంతాలకు కృష్ణా జలాలు అవసరం. ఆ ప్రాంతంలో మనకు ఉన్నన్ని వాగులు కానీ, చెరువులు కానీ లేవు. ఆ రెండు ప్రాంతాలకు కృష్ణా జలాలు వస్తున్నాయి. తిరువూరుకు కూడా 70కి.మీ. ఎగువకు కృష్ణాజలాలు ఇస్తామనటం తప్పక తుగ్లక్ ఆలోచనే.
*** ప్రతి రోజు మంచి నీరు అందాలంటే…?
తిరువూరు ప్రజా ప్రతినిధులకు మెడకాయలు వాటిపైన తలకాయలు ఉన్నా అవన్నీ కరిమింగిన వెలగపండుకు కవల సోదరులు. ఎవరికీ వారే సొంత వ్యాపారాలు, కాంట్రాక్టులు గురించి ఆలోచిస్తున్నారు తప్ప తిరువూరు ప్రజలకు ప్రతినిత్యం మంచినీరు అందించే విషయంపై దృష్టి పెట్టడం లేదు. సాగర్ ప్రధాన కాలువ 79వ కి.మీ సమీపంలో తిరువూరులో 7చెరువులకు నీరు వచ్చే రాకట్ సప్లై ఛానల్ ప్రారంభమవుతుంది. అది సాగర్ జోన్–2 ప్రాంతంలో ఉంది. సాగర్ జోన్–2కు ఆగష్టు నెల నుండి ఏప్రిల్ ఆఖరి వరకు సాగర్ జలాలు విడుదల అవుతున్నాయి. ఈ జలాలతో 7చెరువులలో కనీసం మూడు చెరువులనైనా రిజర్వాయరుగా మార్చుకోవచ్చు. సాగర్ కాలువ పక్కనే ఉన్న మర్లకుంట సమీపంలోని జంగంవారికుంటను సాగర్ జలాలతో తేలికగా నింపవచ్చు. జంగంవారికుంటను రిజర్వాయరుగా మార్చితే తిరువూరులో సగం ప్రాంతానికి రెండుపూటల నీరు పుష్కలంగా ఇవ్వవచ్చు. ఇది కాకుండా కట్టలేరు మీద లంకాసాగర్ అలుగు నుండి అక్కడక్కడ తిరువూరు సమీపంలో చిన్నచిన్న చెక్‌డ్యాంలు నిర్మిస్తే తిరువూరు బోర్లలో నీటినిల్వలు సమృద్ధిగా ఉంటాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో ప్రతినిత్యం మంచినీరు వదులుతామని ఆర్భాటంగా ప్రకటించింది. తిరువూరు మున్సిపల్ పాలకవర్గం, అధికారులు కాంట్రాక్టులు చేసుకోవడం, బిల్లులు చెల్లించడం, పన్నుల వసూళ్లల్లో చూపుతున్న శ్రద్ధ మంచినీరు అందించే విషయంపై చూపడం లేదు కదా అలసత్వాన్ని అధికంగా ప్రదర్శిస్తున్నారు.
*** ఒక్కసారి లంకాసాగర్ ప్రాజెక్టును చూసి సిగ్గుతెచ్చుకోండి!!!
తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్న సమయంలో మన పొరుగునే ఉన్న లంకాసాగర్ ప్రాజెక్టులో ఒక మంచినీటి ప్రాజెక్టును ఏర్పాటు చేయించారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా గత 10ఏళ్ల నుండి 20 గ్రామాలకు ప్రతిరోజూ నీరు అందిస్తున్నారు. సాగర్ జలాలను అక్రమంగా ఒక పిల్ల కాలువను త్రవ్వి ఈ ప్రాజెక్టుకు మళ్లిస్తున్నారు. కట్టలేరు మీదే ఈ ప్రాజెక్ట్ ఉంది. అంతకన్నా ఎక్కువ వనరులు తిరువూరులో ఉన్నాయి. ప్రజాప్రతినిధుల్లారా…మీరు కళ్ళు తెరిస్తే కొద్ది నెలల్లోనే తిరువూరుకు ప్రతిరోజు మంచినీరు ఇవ్వవచ్చు. మీకు చేత కాకపొతే ప్రజల నుండి లేదా తలపండిన రైతుల నుండి సలహాలు తీసుకోండి. దీనిపై ఒక సమావేశాన్ని నిర్వహించండి. లేకపోతే తిరువూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కుండపోత వర్షానికి బోర్లించిన బొచ్చె అడ్డుపెట్టినట్లు…ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోకపోతే ఈ సారి పట్టణ ప్రజలు మీ వంక చూడను కూడా చూడరు.—కిలారు ముద్దుకృష్ణ.
ప్రస్తుతం తిరువూరు సమీపంలోని కట్టలేరులో మండు వేసవిలో కూడా సమృద్ధిగా ఉన్న సాగర్ జలాలు. వీటిని ఓడిసి పడితేనే తిరువూరు దాహార్తి తీరుతుంది.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.