అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజున బిజీగా గడిపారు. పలు కంపెనీల సీఈవో లతో సమావేశం అయ్యారు. స్టాన్ ఫోడ్ విశ్వ విద్యాలయ సందర్శనతో చంద్రబాబు రెండో రోజు పర్యటన ప్రారంభమైంది. అనంతరం చంద్రబాబు బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించింది. గూగుల్ ఎక్స్ కంపెనీ ఇక్కడ అత్యాధునికమైన పరికరాలను రూపొందిస్తుంది. ఇక్కడ తయారు అవుతున్న డ్రైవర్ లేని కారును చంద్రబాబు తిలకించారు. డ్రైవర్ లేకుండానే ఈ కారులు త్వరలో రోడ్ల పై పరుగెత్తే విధంగా గూగుల్ వీటిని రూపొందిస్తుంది. చంద్రబాబు ఈ కారులో కూర్చొని కొద్ది సేపు పరిశీలించారు. దీనితో పాటు గూగుల్ గ్లాసెస్ తయారీ విధానాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ తదితరులు చంద్రబాబు పర్యటనలో పాల్గొన్నారు.