దేశవ్యాప్తంగా ఎన్నికలన్నీ ఒకేసారి నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనకు అనుగుణంగా చంద్రబాబు కూడా ప్రణాళికలు వేసుకుంటున్నారు. అనుకున్న సమయం 2019 మే కన్నా ముందుగానే పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ నియోజకవర్గాలకు చంద్రబాబు మంత్రులను ఇన్చార్జులుగా నియమించారు. నూతనంగా మంత్రి పదవి చేపట్టిన తన కుమారుడు లోకేష్‌కు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ బాధ్యతలను అప్పగించారు. దీంతో చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి వచ్చే ఎన్నికల్లో విజయవాడ లోక్‌సభ స్థానం నుండి దేశం అభ్యర్థిగా పోటి చేస్తారని విజయవాడలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వెంటనే బ్రాహ్మణి తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని ప్రకటించినప్పటికీ వచ్చే ఎన్నికలు నాటికి బ్రాహ్మణి ని రంగంలోకి దింపడం ఖాయమని చంద్రబాబు వైఖరి తెలిసిన రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గత ఎన్నికల్లో వివిధ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థులను మార్పు చేసి చంద్రబాబు వారిని గెలిపించుకున్నారు. గత ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లాలో వైకాపా బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా తన పార్టీ తరుపున చంద్రబాబు అభ్యర్దులను రంగంలోకి దింపారు. ఈ పర్యాయం కూడా ఇదే ప్రయోగాన్ని చంద్రబాబు చేయబోతున్నారు.
*** లగడపాటికి ఎర!
రాజకీయ పునరాగమనం కోసం తహతహలాడుతున్న మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్‌కు వైకాపా ఇటీవల ఎరవేసింది. లగడపాటి వైకాపాలో జగన్‌తో వచ్చే ఎన్నికల్లో జట్టు కట్టబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో చంద్రబాబు తన రాజకీయ చతురతను ప్రదర్శించారు. లగడపాటికి కాకితో కబురు పంపించారు. ఆగమేఘాల మీద చంద్రబాబు ఛాంబర్లోకి వెళ్లిన లగడపాటి మాంచి ఆనందంతో వెనక్కి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో లగడపాటి జన్మస్థలమైన గుంటూరు లోక్‌సభ స్థానం నుండి దేశం అభ్యర్థిగా పోటి చేయడానికి సిద్ధం కావల్సిందిగా చంద్రబాబు రాజగోపాల్‌కు సూచించినట్లు సమాచారం.
*** రాయపాటి రెస్టు తీసుకో!
ప్రస్తుత గుంటూరు పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్‌ను వచ్చే ఎన్నికల్లో నరసరావుపేటకు తరలిస్తున్నారట. అక్కడ ఉన్న ప్రస్తుత ఎంపి, రాజకీయ కురువృద్ధుడు రాయపాటి సాంబశివరావును ఇక రెస్ట్ తీసుకోమని చంద్రబాబు సలహా ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద రానున్న ఎన్నికలకు ప్రతిపక్షాల కన్నా చంద్రబాబే చురుగ్గా పావులను కదుపుతున్నారు.—కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.