తిరువూరు ప్రస్తుత శాసనసభ్యుడిగా ఉన్న కొక్కిలిగడ్డ రక్షణనిధి మంచివాడు, సౌమ్యుడు, నిజాయితీపరుడు, నిరాడంబరుడిగా ప్రజల్లోనూ, అధికారుల్లోనూ పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అవినీతి విషయంలో రక్షణనిధి ఆమడ దూరంలో ఉంటారని ఎవరి నుండి పైసా ఆశించరని బాగా ప్రచారంలో ఉంది. తిరువురుకు మొదటి నుండి ఉన్న విచిత్ర ఆనవాయితీ ప్రకారం నామినేషన్‌కు కొద్ది గంటల ముందు నుండే వివిధ పార్టీల తరఫున పోటి చేసే అభ్యర్థులు ఎక్కడెక్కడ నుండో హఠాత్తుగా ఉన్నట్లుండి ఊడిపడుతుంటారు. అలా వచ్చిన వారే ప్రస్తుత ఎమ్మెల్యే రక్షణనిధి. తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం బలంగా ఉన్నప్పటికీ ఆ పార్టీకి ఏకైక దిక్కు అయిన స్వామిదాస్‌కు తెదేపా నాయకులు, కార్యకర్తలకు మధ్య ఉన్న అపరిమితమైన ప్రేమాభిమానాలు వికటించటంతో రక్షణనిధి కొద్ది ఓట్ల తేడాతో అనూహ్య విజయం సాధించారు. ఎన్నికైనప్పటి నుండి గడిచిన మూడు సంవత్సరాల్లో రక్షణనిధి ఏ సందర్భంలోనూ వివాదాలు కొనితెచ్చుకోలేదు. ఎవరితోనూ పేచీలు పెట్టుకోలేదు. మంచి వ్యక్తిగానే గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఇసుక, మట్టిదందాలను, అక్రమ కాంట్రాక్టులను బుద్ధిమంతుడు లాగా రక్షణనిధి చూస్తూ ఊరుకున్నారని వైకాపా వర్గాలు కూడా ఆయనపై అసంతృప్తిగా ఉన్నారు.
*** పార్టీ వర్గాలలోను అసంతృప్తి
రాజకీయాల్లో మంచితనం అనేది నేటి పరిస్థితుల్లో సరిపడని విషయం. ఎదురుగా జరుగుతున్న ఘోరాలను, దందాలను చూస్తూ ఊరుకోవడం ఎమ్మెల్యే అసమర్థతకు నిదర్శనంగా ఆ పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. తిరువూరు నగర పంచాయితీలో వైకాపా ప్రస్తుతం చాలా బలంగా ఉంది. ప్రస్తుత నగర పంచాయితీలో చాలా కుంభకోణాలు జరుగుతున్నాయని తమ పార్టీ కౌన్సిలర్లు ప్రతి సమావేశంలో రగడ చేస్తున్నప్పటికీ రక్షణనిధి మాత్రం తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల ప్రజలు సైతం అసంతృప్తితో ఉన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా ఆసుపత్రి చైర్మెన్ పదవి నుండి ఆయనను అర్థాంతరంగా ప్రభుత్వం తొలగించినప్పటికీ కనీసం ప్రభుత్వంపై పోరాటం చేయాలన్న ఆలోచన కూడా రక్షణనిధి విస్మరించారు. తిరువూరు మండల పరిషత్ కార్యాలయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున కుంభకోణాలు జరుగుతున్నాయి. భారీగా నిధులను దిగమింగారన్న ఆరోపణలు వస్తున్నాయి. గత మూడు సంవత్సరాల నుండి ఎండీవో పదవి ఖాళీగా ఉన్నప్పటికీ కనీసం జిల్లా కలెక్టర్‌ను లేదా పంచాయితీ రాజ్ కమీషనరును ప్రశ్నిద్దామన్న ఆలోచన కూడా రక్షణనిధికి రాకపోవడం శోచనీయం. పలు అభివృద్ధి పనుల పురోగతిపై తరచు అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించవలసిన ఎమ్మెల్యే ఆ విషయాన్నే మరిచిపోయారన్న అసంతృప్తి ప్రజల్లో ఇబ్బడిముబ్బడిగా ఉంది. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న కొన్ని శాఖల అధికారులు, సిబ్బంది, స్థానిక దేశం నేతల సహకారంతో పెద్ద ఎత్తున అవినీతి, దోపిడీకి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
*** వైకాపా కార్యకర్తలకు రక్షణ ఏది!?
ఎమ్మెల్యే తిరువూరులో పూర్తిగా నివాసం ఉండకుండా తోట్లవల్లూరు నుండి తిరువూరుకు షికారు చేస్తున్నారు. ఆయన ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక అతిథిగానే తిరువూరుకు వస్తున్నారని ఆయన తమకే అందుబాటులో ఉండటం లేదని వైకాపా కార్యకర్తలు వాపోతున్నారు. వివిధ గ్రామాల్లో వైకాపా కార్యకర్తలు, అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల వేధింపులకు గురి అవుతున్నారు. వారికి పూర్తిగా రక్షణ కల్పించి భరోసా ఇవ్వడంలో ఎమ్మెల్యే వైఫల్యం చెందారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో ఉంది. రక్షణనిధి ఎమ్మెల్యే అయిన అనంతరం ఇప్పటి వరకు తిరువూరు నియోజకవర్గ వైకాపా కార్యకర్తల సమావేశాన్నే నిర్వహించలేకపోయారని, మండల పార్టీ సమావేశాలు కూడా జరగడం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఎన్నికల సమయంలో తిరువూరులో పూర్తిస్థాయిలో నివాసం ఉంటానని ప్రకటించిన రక్షణనిధి ఆ మాటను విజయవంతంగా నిలబెట్టుకోలేకపోయారు. కొడాలి నాని, మేక అప్పారావు, ఆళ్ళ రామకృష్ణరెడ్డి వంటి వైకాపా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అధికార పార్టీని ఎదుర్కొని పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. తిరువూరులో మాత్రం వైకాపాకు ఇప్పటికీ మంచి బలం ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల వరకు దానిని కాపాడుకోవలసిన బాధ్యత తమ ఎమ్మెల్యేపై ఉందని…ఇప్పటికైనా రక్షణనిధి తిరువూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోపక్క స్థానిక ప్రజలు కూడా తమ ఎమ్మెల్యే తమకు అందుబాటులో ఉండాలని తమ సమస్యలపై పోరాటం చేయాలని స్థానిక సమస్యలను చక్కదిద్దాలని కోరుకుంటున్నారు.—కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.