దాదాపు సంవత్సరం క్రితం హత్యకు గురైన దోమతోటి నాగేశ్వరరావు ప్రస్తుతం చనిపోయి తన హత్యకు కారకులైన నిందితులను సాధిస్తున్నాడు. బహుశా “సచ్చి…సాధిస్తానంటే..” ఇదేనేమో! ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అక్కపాలెం గ్రామస్థులను, ఇద్దరు(కోకిలంపాడు, విజయవాడ) బయట ప్రాంతాలకు చెందినవారిని పోలీసులు అరెస్టు చేసి అక్కపాలెం గ్రామ తెలుగుదేశం నేతలు కొందరిని ముద్దాయిలుగా పేర్కొంటూ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. గతంలో సీఐగా పనిచేసిన కిషోర్‌బాబు ఈ కేసులో తమకు న్యాయం చేయడం లేదని కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయడంతో దీని విచారణ బాధ్యతను మరో అధికారికి అప్పట్లో అప్పగించారు. ఆ అధికారి విచారణ చేపట్టిన అనంతరం దోమతోటి హత్య కేసులో ముగ్గురు తెలుగుదేశం స్థానిక నేతలతో పాటు మరో నలుగురిని బయట వ్యక్తులుగా చేర్చి అరెస్టు చేశారు. అయితే ఈ కేసు విషయంలో తనకు న్యాయం జరగలేదని అసలు ముద్దాయిలను పోలీసులు ఈ కేసు నుండి తప్పించారని హత్యకు గురైన నాగేశ్వరరావు భార్య, ప్రస్తుత అక్కపాలెం సర్పంచ్ వెంకటరమణ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తిరిగి పునర్విచారణ చేయాలని, సి.బి.సి.ఐ.డి.కు కేసును అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
*** కాంగ్రెస్ నేతల చేతుల్లో దేశం నేతల గుట్టు
దోమతోటి నాగేశ్వరరావు హత్య కేసులో ముష్టికుంట్ల, కొమ్మిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన ఇరువురు తెలుగుదేశం మండల స్థాయి నాయకుల ప్రధాన పాత్ర ఉందని మృతుడు నాగేశ్వరరావు భార్య ఆరోపిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి వీరిరువురిని ఈ కేసు నుండి బయటపడేశారని, మరికొందరు దేశం నేతల హస్తం కూడా దీనిలో ఉందని నాగేశ్వరరావు భార్య ఆరోపిస్తున్నారు. ఈ ఇరువురు మండల స్థాయి నేతలు దోమతోటి హత్య కేసులో ఉన్నట్లుగా నిరూపించే ఆధారాలు కాంగ్రెస్ నేతల చేతుల్లో ఉన్నట్లు సమాచారం. హత్య జరిగిన రోజు రాత్రి, అంతకుముందు రెండు రోజుల నుండి నిందితులు జరిపిన ఫోన్ సంభాషణల రికార్డును వీరివద్ద ఉన్నట్లు సమాచారం. దీంతో పాటు ఒక మండల స్థాయి నాయకుడు దోమతోటి బ్రతికి ఉంటే మండలంలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాగించలేదని పార్టీ నాయకత్వానికి రాసిన లేఖ కాపీ కూడా కాంగ్రెస్ నేతల వద్ద ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా దోమతోటి హత్య కేసులో ఇరువురు మండల స్థాయి నాయకులను నిందితులుగా ఈ కేసులో చేర్చే విషయంపైనే కాంగ్రెస్ నేతలు, దోమతోటి భార్య దృష్టి సారించారు. తమ వద్ద ఉన్న ఆధారాలను సి.బి.సి.ఐ.డి అధికారులకు అందజేయనున్నట్లు సమాచారం. ఈ విషయంపై సి.బి.సి.ఐ.డి అధికారులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. గత బుధవారం తిరువూరుకు వచ్చి కేసు పూర్వాపరాలను సేకరించారు.
*** గజగజ వణుకుతున్న దేశం నేతలు
ఇప్పటి వరకు తమ పదవులను అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా అమాయకులను సైతం దోచుకుతింటున్న ఇరువురు మండల స్థాయి దేశం నాయకులు హైకోర్టు ఆదేశాలతో గజగజ వణికిపోతున్నారు. తమ పాత్ర ఎక్కడ బయటపడుతుందోనని, తమ పాపాలు ఎక్కడ బయటపడతాయోనని, తమ మెడకు ఉరి బిగుస్తుందేమోనని హడలి ఛస్తున్నారు. కాగా స్థానికంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో పాటు దేశం కార్యకర్తలు, నాయకులు మాత్రం వీరి దోషిత్వం నిరూపణైతే శిక్షలు పడాల్సిందేనని బహిరంగంగా ముచ్చటించుకుంటున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.