తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశానికి భారీగా కార్యకర్తల బలం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. 1983లో పార్టీ పెట్టినప్పటి నుండి ఆ పార్టీకి నియోజకవర్గంలో ఉన్న బలం ఏ మాత్రం చెక్కుచెదరలేదు. వచ్చిన చిక్కంతా నాయకులతోనే. సమర్థవంతమైన నాయకత్వం లేకపోవడం, కార్యకర్తలను సమన్వయపరచలేకపోవడం, ఉన్న బలాన్ని కాపాడుకోలేకపోవడం తదితర కారణాల మూలంగా గత మూడు ఎన్నికల్లో స్వామిదాస్ తన స్వహస్తాలతో బయట వ్యక్తులకు ఎమ్మెల్యే పదవులు అప్పనంగా కట్టబెట్టారు. తిరువూరు నియోజకవర్గంలో తెదేపా నాయకత్వ లోపం ఉందని పార్టీకి మాత్రం బలమైన క్యాడర్ ఉందని గమనించిన చంద్రబాబు తిరువూరు తెదేపాను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. స్వామిదాస్ గత ఎన్నికల్లో గెలిచి ఉంటే రావెల కిషోర్బాబో లేక కొత్తపల్లి జవహర్బాబో మంత్రులు అయి ఉండేవారు కారు. స్వామిదాస్ తప్పనిసరిగా మంత్రి అయి ఉండేవారు. చంద్రబాబుకు, తెదేపాలో ఉన్న సీనియర్ నాయకులకు స్వామిదాస్ అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు చేజేతులా పరాజయం కొని తెచ్చుకుంటున్నాడన్న ఆగ్రహం కూడా ఉంది. వాస్తవానికి స్వామిదాస్ దంపతులు పార్టీలో పోలిట్‌బ్యూరో స్థాయిలో ఉండవలసిన నేతలు. ఇద్దరికీ చంద్రబాబు మంచి అవకాశాలే ఇచ్చారు. అయినప్పటికీ వారు వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మొన్న మంత్రివర్గ విస్తరణ సమయంలో చంద్రబాబుకు తిరువూరు నియోజకవర్గం గుర్తుకు వచ్చింది. స్థానికుడైన కొత్తపల్లి జవహర్‌కు మంత్రి పదవి ఇస్తే అటు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న కొవ్వూరుతో పాటు తిరువూరులో కూడా పార్టీని పటిష్ఠవంతం చేయవచ్చని చంద్రబాబు భావించారు. ఇదే విషయాన్ని జవహర్‌కు కూడా చంద్రబాబు తెలిపినట్లు సమాచారం. దాని మూలంగానే ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మంత్రి కొత్తపల్లి జవహర్ విస్సన్నపేట, తిరువూరులలో పర్యటించారు. తన అనుచరులతో సమావేశమయ్యారు. తిరువూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టిపెడతానని జవహర్ మీడియా ముందు వెల్లడించారు. స్వామిదాస్ ఇక నుండి తెల్లవారక ముందే నిద్రలేచి అర్థరాత్రి వరకు పార్టీ వ్యవహారాలను చక్కబెట్టకపోతే వచ్చే ఎన్నికల్లో కొత్తపల్లి జవహర్ ఎన్నికల రంగంలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. జవహర్ సోదరుడు కొత్తపల్లి రవీంద్రనాథ్ 1989లో తెలుగుదేశం అభ్యర్థిగా తిరువూరు నుండి పోటీ చేసి కేవలం 1800 ఓట్ల తేడాతో అప్పటి కాంగ్రెస్ మంత్రి కోనేరు రంగారావు చేతిలో పరాజయం పాలయ్యారు. మళ్లీ ఈసారి తమకు తిరువూరు నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని కొత్తపల్లి కుటుంబం నుండి చంద్రబాబుకు ఇప్పటికే వినతులు వెళ్లడం ప్రారంభమయ్యాయి. ఇక స్వామిదాస్ జూలు విదుల్చుతారో…లేక జుట్టు అందిస్తారో వేచి చూడాల్సిందే.—కిలారు ముద్దుకృష్ణ.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.