గంపలగూడెం మండలంలోని నెమలి వేణుగోపాలస్వామి ఆలయంలో బుధవారం స్వామివారి ఉద్భావన వేడుకలు వైభవంగా నిర్వహించారు. 1953 మార్చి 23న శ్రీరామనవమినాడు స్వామివారు స్వయంభూగా నెమలిలో వెలిశారు. 1957 ఫిబ్రవరి 6న స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఏటా శ్రీరామనవమినాడు స్వామివారి ఉద్భావన ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రధానార్చకులు టి.గోపాలాచార్యుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం స్వామివారి మూలవిరాట్ను సువర్ణాభరణాలు, నూతన వస్త్ర్రాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు.. శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమైన 9 రకాల ప్రసాదాలు, పానకం భక్తులకు పంపిణీ చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వి.రాజశేఖర్, ఈవో వై.శివరామయ్య, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేసారు.. ఆంజనేయస్వామి ఆలయంలో కూడా సీతారాముల కల్యాణం నిర్వహించారు.