రంగుల కోసం మనం ఎదురుచూడటం రొటీన్! మన కోసం.. రంగులఖేళీ కోసం ఓ చెట్టు ఎదురుచూడటం ట్రెండ్! ఆ ట్రెండ్ మన చేతుల్లోనే ఉంది! అదిగో.. నిండా విరబూసి.. ఎండకు మెరుస్తూ.. వెన్నెలకు ప్రకాశిస్తూ ఉన్నది ఆ చెట్టు! అదే మోదుగుచెట్టు! వసంతం రాకను.. రంగ్‌దే బసంతీ ఆటల కేకను వినిపించడానికి సిద్ధంగా ఉంది! ఎప్పుడూ ఆ రసాయనిక రంగులతో.. కోడిగుడ్లతో హోలీ ఆడటమేనా? సహజ రంగులతో.. బుక్కా గులాల్‌తో.. మోదుగుపూల రంగులతో ఈసారి హోలీ జరుపుకొని.. అచ్చమైన రంగులమయజీవితానికి శ్రీకారం చుడుదాం. ఓ రంగుల చిలకా.. చూడే నీ వెనకా.. నీ కోసం పుట్టిందే ఈ మోదుగ మొలకా అంటూ ఆడిపాడదాం. హ్యాపీ హోలీ! హోలీ హోలీల రంగ హోలీ చెమ్మకేళిల హోలీ. కాముని కాంతలొచ్చినారు హోలీ చెమ్మకేళిల హోలీ. బాయిబాయి తిరిగినారు హోలీ చెమ్మకేళిల హోలీ. బసంతాలు చేసినారు హోలీ చెమ్మకేళిల హోలీ అంటూ బాధల బంధనాల్ని తెంచుకుంటూ నిత్య సంతోషాలతో జీవితం ఆనందంగా తీర్చిదిద్దుకోవాలని హోలీని పాటల పూదోటగా పూయిస్తారు. బస్తీ బస్తీ.. బాయి బాయి తిరిగి బసంతాలు చేసుకుంటారు. రంగులు గుప్పుకొని.. సరదాల్ని కప్పుకుంటారు. భిన్న మనస్తత్వాలు.. భిన్న వ్యక్తిత్వాలు.. భిన్న రంగులు కలిసి ఒకచోట చేరి పంచుకుంటారు.! రంగు పడలేదని ఒకరు.. రంగు పడిందని మరొకరు సంతోషిస్తూ ఉంటారు!హోలీ అంటే అందరికీ ఇష్టమే. కానీ ఒక్కొక్కరు ఒక్కో కోణంలో ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరు రంగును ఇష్టపడితే.. ఇంకొకరు ఆటను ఇష్టపడతారు.. మరొకరు పాటను ఇష్టపడతారు. సహజ రంగులతో హోలీ జరుపుకున్నట్లే సహజ వాతావరణంలో.. సమానత్వంలో కూడా పండుగ సెలబ్రేట్ చేసుకుంటే పర్యావరణం పరంగా.. ఆరోగ్యపరంగా మనకు మంచిది! రంగులు కుప్పుకునేందుకు పోటీలు పడి.. గ్రూపులగా విడిపోయి విద్వేషాలకు పోవడం కన్నా హాయిగా.. ఆనందంగా జరుపుకోవడం చాలా మంచిది. ఒకసారి బర్సానా హోలీ ఉత్సవాల గురించి తెలుసుకోండి. ఎంత ఉత్సాహంగా.. ఉల్లాసంగా జరుపుకుంటారో అర్థమవుతుంది. బర్సానా ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ చాలా భిన్నమైన వాతావరణం. హోలీ అంటే సరికొత్త అనుభూతి కలిగే ప్రాంతమిది. హోలీ రోజున మహిళలను రంగులతో ముంచెత్తడమే కాదు.. మగాళ్లను లాఠీలతో కొడతారు. ద్వాపరయుగంలో కృష్ణుడు.. రాధకు రంగులు పులిమి పారిపోతుంటే.. అమ్మాయిలంతా ఇలా లాఠీలు పట్టుకుని ఆయన్ని వెంబడించారట. అదే ఇక్కడిప్పుడు సాంప్రదాయంగా మారి హోలీని ఆనందఖేళీగా మార్చేసింది. మహిళలంతా పక్కనే ఉన్న నందగావ్ గ్రామం నుంచి వచ్చే పురుషుల కోసం లాఠీలు పట్టుకుని ఎదురుచూస్తూ ఉంటారు. వాళ్లు ఊరిలోకి అడుగుపెట్టగానే లాఠీలతో తరుముతూ రంగులు పులుముతూ ఉంటారు. పురుషులు ఈ గిలిగింతలను.. లాఠీ దెబ్బలను తప్పించుకునేందుకు పరుగులు తీస్తూ ఉంటారు. అబ్బ.. వీరి ఆటపాటల్ని చూసేందుకు నిజంగా రెండు కళ్లూ సరిపోవేమో? హోలీ అంటే ఇలా ఉండాలి. ఎలాంటి అభిప్రాయ భేదాల్లేకుండా.. అంతా కలగలిసి ఆడిపాడటం కన్నా వేరే ఏం కావాలి? ఇండియాలో రాధ గుడి కేవలం బర్సానాలో మాత్రమే ఉంది. అందుకే దేశ నలుమూలల నుంచి హోలీ సంబురాల కోసం ఇక్కడకు ఆసక్తిగలవారు వస్తుంటారు. భక్తితోపాటు సరదా ఆటలతో కూడా ఎంజాయ్ చేస్తుంటారు. జానపదగీతాలు.. డ్యాన్సుల్లో మునిగితేలుతారు. చలికాలానికి వీడ్కోలు తెలుపుతూ వసంతానికి స్వాగతం పలుకుతూ సాగే ఈ హోలీఖేళీని ఆస్వాదించాలంటే ఒక్కసారైనా బర్సానాకు వెళ్లాల్సిందే! హోలీ పండుగ నాడు పూసుకున్న రంగులు ఒక్కోసారి వారం రోజుల దాకా అలాగే ఉంటున్నాయి. రంగులు ఈ రోజు ఉంటాయి.. రేపు పోతాయి. కానీ రాగద్వేషాలు ఒకసారి పూసుకుంటే పోనేపోవు. హాయిగా ఎవరికివారు హోలీ సంబురాలు నిర్వహిస్తుంటారు. ఆడిపాడుతుంటారు. కొన్నిచోట్ల బామ్మర్దులు.. బావలు.. వదినా మరదల్లు వరసయ్యే వాళ్లకు మాత్రమే రంగులు పూయాలని అంటారు. మరొక చోట ముసలివాళ్లు.. పిల్లలు హోలీ ఆడటమేంటి అంటారు. దాదాపు అన్నిచోట్లా వితంతువులు హోలీ ఆడకూడదనే నిబంధనలు అమలవుతూనే ఉన్నాయి. ఒక్క బృందావన్‌లో తప్ప! ఆశల హోలీలో సరదాలు ఉండటం చాలా మంచిదే. అవి ఏ ఒక్కరి సొంతం కాదు. సందేశమూ ఉండాలి అంటున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్ ప్రజలు. వాళ్ల ఆలోచన ఏంటంటే.. వితంతువులు సైతం హోలీలో పాల్గొనాలి. అందరిలాగే వాళ్లూ ఆడిపాడి సంబురాలు చేసుకోవాలి అని. హోలీ ఎవరు ఆడాలి? అనే ప్రశ్నే ఉత్పన్నం కావొద్దంటున్నారు వాళ్లు. ఆడా.. మగా.. చిన్నా.. పెద్దా అంతా ఆడాలి. వితంతువులు కూడా ఆడాలి అని ఈ కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు బృందావన్ ప్రజలు. వసంతం వస్తుందంటే మురిసిపోయి ఎవరికివారు ఆడిపాడటం కాదు.. అందరూ సమానమనే భావనతో ఆడాలి అంటూ ఇక్కడ ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ రంగులాటతో బృందావనంలోని వితంతువుల ముఖాలు.. మోదుగుపూలు వికసించిన నందవనంలా కనిపిస్తుంటాయి. రంగుల పండుగ హోలీ. మనదేశంలో ఆబాలగోపాలం ఆనందంతో చేసుకునే పండుగ ఇది. సహజసిద్ధమైన.. పర్యావరణ హితమైన రంగులు చల్లుకుంటూ చేసుకునే ఈ వేడుక ఇటీవలికాలంలో పలు మార్పులకు గురవుతున్నది. హోలీ రంగుల్లో రసాయనాలు.. పారిశ్రామిక వ్యర్థాలు కలిపి అమ్ముతున్నారు. తెలియక ఈ రంగులు కొని చల్లుకోవడం వల్ల పలు సమస్యలు వస్తున్నాయి. కృత్రిమ రంగుల స్థానంలో సహజసిద్ధమైన రంగులే ఈ సమస్యకు ఏకైక పరిష్కారం. సహజ రంగులు అంటే ముందుగా గుర్తొచ్చేది మోదుగుపూలు.చాలా సింపుల్ మోదుగుపూలను తెంపి.. నీళ్లలో వేసి ఉడికించాలి. దాంతో నీళ్లన్నీ ఎర్రని రంగులో ఏ సునేర్ పూతలివ్వని రంగుల్ని ఇస్తాయి. ఉదాహరణకు గోవా. అక్కడ బీచ్‌లో అందమైన దృశ్యాలు కనిపిస్తాయి కొందరికి. కానీ పర్యావరణం దృష్టి కోణంలో ఆలోచించేవాళ్లకు బుక్కా గులాల్ కనిపిస్తాయి. గులాల్ చల్లుకుని.. గుత్పలు పట్టుకుని హోలీ ఆటలాడతారు అక్కడ. దీనిని సిగ్మోత్సవ్ అంటారు. మొదటగా అక్కడి గ్రామదేవతలను పూజించి.. మొక్కులు సమర్పించి.. సాంప్రదాయబద్దంగా.. పర్యావరణహితంగా హోలీ జరుపుతామని గోవా ప్రజలు సిగ్మోత్సవ్ నిర్వహిస్తారు. హోలీ గురించి చెప్తే నోటు గురించి కూడా చెప్పినట్టే. కొత్త ఐదువందలు.. రెండువేల రూపాయల నోట్లు వచ్చాయి కదా.. వాటిపై రంగు పడితే చెల్లుబాటు కావని రిజర్వ్‌బ్యాంక్ తాజాగా స్పష్టం చేసింది. నోట్లపై గీతలు పడితే చెల్లవని ఇది వరకే చెప్పింది కదా.. ఇదీ అలాగే అన్నమాట. వాస్తవానికి క్లీన్ నోట్ పాలసీ 1999 నుంచే ఉన్నప్పటికీ పెద్దగా అమలు కాలేదు. కానీ ఈ సారి పక్కాగా అమలుచేసేందుకు ఆర్బీఐ ప్లాన్ చేస్తున్నది! కాబట్టి ఒకసారి హోలీ ఆడేముందు నోట్లను సరిచూసుకోండని చెప్తున్నారు నిపుణులు. రంగు పడిన నోట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరని చెప్తున్నారు అధికారులు. కాబట్టి సహజ రంగులతో.. సహజ వాతావరణంలో హోలీ పండుగ జరుపుకోవాలని.. శరీరానికి.. పర్యావరణానికి.. మనసుకు ఎలాంటి హాని జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. రసాయనాలు కలిసిన రంగులతో హోలీ ఆడితే వాటిని శరీరంపై ఎక్కువ సమయం ఉండనీయకండి. చల్లని నీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోండి. ఎక్కువగా ఎరుపు.. పింక్ రంగులనే హోలీ కోసం వాడండి. ఇవి తక్కువ గాఢత కలిగి ఉండడంతో సులభంగా తొలగిపోతాయి. గ్రీన్.. ఎల్లో.. ఆరెంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉన్న కారణంగా సులభంగా శరీరంపై నుంచి తొలగిపోవు. హోలీ ఆడటానికి ముందు మీ ముఖానికి మాయిశ్చరైజర్‌ని.. తలకు నూనెను రాసుకోండి. దీనివల్ల రంగులు శరీరంలోకి ఇంకవు. రంగులను శుభ్రం చేయడం కూడా సులభమవుతుంది. ఆకుకూరలను పేస్ట్చేసి దాన్ని నీటిలో కలిపితే ఆకుపచ్చ రంగు నీరు రెడీ అయినట్టే. ఎర్ర చందనం పొడిని హోలీ రంగుగా వాడొచ్చు. దాన్ని నీటిలో మరిగిస్తే ఎర్రరంగు నీళ్లు సిద్ధమైనట్టే. పసుపు.. శనగపిండి కలిపితే నిండు పసుపు రంగు కూడా ఉన్నట్టే. గోరింటాకు పొడి నీటిలో కలిపి నారింజ రంగు చేసుకోవచ్చు. గోరాంటాకు పొడి.. ఉసిరి కాయ పొడిని నీటిలో కలిపితే ముదురు గోధుమరంగు వస్తుంది. మందారపూల గుజ్జును నీటిలో కలుపుకుంటే ఎర్ర రంగు హోలీకి సిద్ధమైనట్లే. బంతి.. చామంతి పూలను రాత్రి నీటిలో నానబెడితే లేత పసుపు రంగు వస్తుంది.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.