నెమలి వేణుగోపాలస్వామి ఆలయ 60వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆరు రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన శుక్రవారం వేణుగోపాలస్వామిని పెండ్లి కుమారునిగా అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయ అర్చకులు టి.గోపాలాచార్యులు ఆధ్వర్యంలో రుత్విక బృందం ఉదయం 5:30 గంటలకు స్వామివారి మూలవిరాట్‌కు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చనలు నిర్వహించారు. సువర్ణాభరణాలు, పుష్పాలతో మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించారు. తదుపరి వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహాన్ని పెండ్లికుమారునిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఉభయ దేవేరులైన రుక్మిణీసత్యభామ ఉత్సవ విగ్రహాలను నూతన వస్త్రాలతో అలంకరించారు. సాయంత్రం విజయవాడకు చెందిన ప్రముఖ వేదపండితులు పరాశరం పట్టాభిరామాచార్యులు ఆధ్వర్యంలో అంకురార్పణ, వాస్తుపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, ధ్వజారోహణం, గరుడపట ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు వడ్లమూడి రాజశేఖర్, కార్యనిర్వాహణాధికారి వై.శివరామయ్య ఆద్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించారు. నెమలి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా పాలకవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అనురాధ వాగు వద్ద జల్లు స్నానాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరువూరు, మధిర, సత్తుపల్లి, విజయవాడ, వైరా ఆర్టీసీ డిపోల నుంచి బస్సు సర్వీసులు నడుపుతున్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.