కృష్ణాజిల్లాలో ప్రసిద్ధి చెందిన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాలస్వామి ఆలయ 60వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 15 వరకు నిర్వహించనున్నారు. స్వామివారికి షష్టిపూర్తి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో పేరెన్నికగన్న పుణ్యక్షేత్రమై, నిత్యం భక్తుల రాకతో పులకిస్తూ…సందడిగా ఉండే ప్రదేశమైన నెమలిలో తమ ఇలవేల్పుగా భావించి లక్షలాది మంది భక్తులు ఇచ్చే విరాళాలతో దినదినాభివృద్ధి చెందుతున్న వేణుగోపాలస్వామి దేవస్థానం మరో నాలుగు రోజుల్లో ప్రారంభంకానున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది.
**ఏటా ఫాల్గుణ శుద్ద పౌర్ణమినాడు ఆలయ బ్రహ్మోత్సవంలో ప్రధానమైన వేణుగోపాలస్వామి తిరు కల్యాణం నిర్వహిస్తారు. భక్తుల మనసు దోచుకున్న నీలమేఘశ్యాముని బ్రహ్మోత్సవాలకు ఆలయాన్ని వర్ణశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా స్వామివారిని ఆరాధించే భక్తులు స్వామి దర్శనం సర్వైశ్వరదాయకమనే భావనతో నెమలి ఆలయాన్ని నిత్యం సందర్శిస్తారు. ఏటా స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో లక్షమంది భక్తులు పాల్గొంటారని భావిస్తూ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు ఆర్డీవో సీహెచ్.రంగయ్య ఆధ్వర్యంలో, ఆలయ కమిటి అధ్యక్షుడు వడ్లమూడి రాజశేఖర్, ఈవో వై.శివరామయ్య పర్యవేక్షణలో ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
**స్వయంభూగా వెలిసిన వేణుగోపాలస్వామి
1953 మార్చి 23న(శ్రీరామనవమి నాడు) వేణుగోపాలస్వామి నెమలిలో స్వయంభూగా వెలిశారు. గ్రామానికి చెందిన వనమా సీతారామయ్య తన పొలానికి సారవంతమైన మట్టి కోసం దారా నర్సయ్యకు చెందిన భూమి కొనుగోలు చేశారు. ఆ భూమిలో తన వద్ద పనిచేసే కఠారు వెంకటేశ్వర్లుతో మట్టిని తవ్విస్తుండగా స్వామివారి విగ్రహం బయల్పడింది. గడ్డపార తగిలి స్వామివారి చిటికెన వేలు విరగగా వెండితో సరిచేశారు. భూమిలో లభించిన నల్లనయ్య విగ్రహాన్ని వేదపండితుల ఆధ్వర్యంలో 1957 ఫిబ్రవరి (రథోత్సవం నాడు) 6న శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. 1958 నుంచి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి స్వామివారి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతూ భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే ఇష్టదైవంగా నిలిచారు. ఈఏడాది 60వ (షష్టిపూర్తి) వార్షిక బ్రహోత్మవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
**15వరకు ఉత్సవాలు
ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి లక్ష మందికి పైగా భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. 10న వేణుగోపాల స్వామిని పెండ్లి కుమారునిగా అలంకరించడంతో (అంకురార్పణ) ఉత్సవాలు ప్రారంభమవుతాయి.11న స్వామికి శేషవాహన మహోత్సవం, 12వ తేదీ రాత్రి రుక్మిణిసత్యభామా సమేత వేణుగోపాలస్వామికి గ్రామంలోని గాంధీµబొమ్మ విగ్రహం వద్ద ఎదురుకోల ఉత్సవం, రాత్రి 11గంటలకు మేళతాళాలతో ఉభయదేవేరుల సమేతుడైన స్వామిని ప్రత్యేక రధంపై కల్యాణ మండపానికి తీసుకువచ్చి తిరుకల్యాణ వేడుక నిర్వహిస్తారు. 13న ఉభయదేవేరులతో స్వామికి రథోత్సవం, 14న పల్లకీ ఉత్సవం(వసంతోత్సవం), 15న ద్వాదశ ప్రదక్షిణలు, స్వామికి పవళింపు సేవ చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఆరు రోజులు పాటు భక్తులను అలరించేందుకు ఆలయ ప్రాంగణంలో రాత్రివేళ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.