తిరువూరు మున్సిపల్ రాజకీయం ఆసక్తికరంగా, రసకందాయకంగా మారింది. చైర్పర్సన్ మరకాల కృష్ణకుమారి, వైస్ చైర్మెన్ సోమవారపు నరసింహారావుతో రాజీనామాలు చేయించి ఆ పదవులలోకి తాము ఎక్కాలని కలలు కంటున్న కౌన్సిలర్ల కోరిక నెరవేరే సూచనలు కనిపించడం లేదు. తెదేపా సమన్వయ కమిటి పేరుతో ఇటీవల స్వామిదాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఒప్పందం ప్రకారం కృష్ణకుమారి తన పదవికి రాజీనామా చేయాలని ఆమె పైన, ఆమె భర్త రామలక్ష్మణ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చారు. అనంతరం కృష్ణకుమారికి అనూహ్యంగా మద్దతు పెరుగుతూ వచ్చింది. నువ్వు రాజీనామా చేయవద్దు అంటూ కొందరు తెదేపా నాయకులు, మరికొందరు ఆ పార్టీ కౌన్సిలర్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇటీవల విజయవాడలో ఎంపి కేశినేని నాని వద్ద ఈ విషయంపై పంచాయతీ పెట్టాలని కృష్ణకుమరితో రాజీనామా చేయించాలని సమన్వయ కమిటి నాయకులు చేసిన ప్రయత్నాలు సైతం ఫలించలేదు. గత మూడేళ్ళ నుండి కృష్ణకుమారి పరిపాలనాపరంగా సమర్థవంతంగా లేకపోయినప్పటికీ వ్యక్తిగతంగా మంచి పేరే తెచ్చుకున్నారు. వివాదాలకతీతంగా అందరూ చెప్పింది సావధానంగా వింటూ కొంత పేరు తెచ్చుకున్నారు. ఇదే ఆమెకు ఇప్పుడు కలిసి వచ్చింది. రోజురోజుకూ ఆమెను రాజీనామా చేయవద్దు అనే వారి సంఖ్య కూడా అనూహ్యంగా పెరుగుతోంది. కొందరు తెదేపా సీనియర్ నేతలు కూడా తెర వెనుక ఉండి కృష్ణకుమారికి మద్దతుగా నిలిచారు. “అంతా పాపం-అంతా పుణ్యం” లేని కృష్ణకుమారి పరిపాలనను గతంలో సర్పంచ్‌గా ఉన్న పరసా బాబురావు పాలనతో సరిపోల్చుతున్నారు. కృష్ణకుమారి పదవి నుండి దిగిపోతే వచ్చే వారి పరిపాలన ఎలా ఉంటుందో అనే బెంగ తెదేపా వర్గాల్లో ఎక్కువగా ఉంది.
* సమన్వయ కమిటి అప్పుడు ఏమైంది?
తిరువూరు తెదేపా సమన్వయ కమిటిలో ఉన్న సీనియర్ నేతలు గత 20 ఏళ్ల నుండి తమకు అనుకూలంగా ఉన్న విషయాలపైనే తీవ్రంగా పట్టుపడుతూ ఉంటారు. తమకు అనుకూలం కాని విషయాలు అసలే పట్టించుకోరు. పరసా బాబురావు తిరువూరు మండల పరిషత్ అధ్యక్షునిగా ఉన్న సమయంలో గడిపర్తి హనుమంతరావు ఉపాధ్యక్షునిగా ఉండేవారు. రెండున్నరేళ్లు హనుమంతరావు, మరొక రెండున్నరేళ్లు కిలారు రమేష్ ఆ పదవిలో ఉండాలని ఒప్పందం జరిగింది. దీనిని అమలు చేయడంలో తిరువూరు నియోజకవర్గ తెదేపా కన్నులుండి చూడలేని ధృతరాష్ట్ర పాలనను తలపించింది. సమన్వయ కమిటి సంపూర్ణంగా విఫలం చెందింది. విస్సన్నపేట మండల పరిషత్ అధ్యక్షునిగా మాగంటి కృష్ణమోహన్ ఉన్న సమయంలో ఆయన రెండున్నరేళ్లు, అప్పిరెడ్డి రెండున్నరేళ్లు పదవిలో ఉండాలని ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందాన్ని కూడా సుద్దులు చెప్పే ఈ కమిటి పెద్దలు నేరవేర్చలేకపోయారు. ప్రస్తుతం తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ వ్యవహారంలోనూ ఇదే కథ పునరావృతం కావడం తిరువూరు రాజకీయాన్ని రసవత్తరంగా మార్చింది.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.