చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకస్తానం సంపాదించుకున్న కృష్ణా జిల్లా కు 110 ఏళ్ళు. రాజకీయ, ఆర్దిక, సాంఘిక చైతన్యం కలిగిన ప్రాంతంగా వినుతికెక్కిన కృష్ణ జిల్లా గత చరిత్రను పరిశీలిస్తే…. రాజమండ్రి, మచిలీపట్టణం, గుంటూరు జిల్లాలను కలిపి 1859 లో కృష్ణా, గుంటూరు జిల్లాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్టణం కృష్ణాజిల్లా కు ప్రధాన కేంద్రంగా మారింది. 1904 లో కృష్ణాజిల్లా నుండి గుంటూరు జిల్లా ను వేరుచేశారు. 1925 లో కృష్ణాజిల్లా నుండి పశ్చిమ గోదావరి జిల్లాను వేరుచేశారు. జిల్లాలో కృష్ణా నది ప్రవహించడం కారణంగా “కృష్ణాజిల్లా “గా నామకరణం చేశారు. జిల్లా విస్తీర్ణం 8,727 చ.కి.మీ. సముద్రం తీరం 88 కి.మీ. ఉత్తరాన ఖమ్మం జిల్లా, దక్షిణాన బంగాళాఖాతం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమ గోదావరి జిల్లా, పడమర గుంటూరు, నల్గొండ జిల్లాలు ఎల్లలుగా ఉన్నాయి. జిల్లాలో 40 శాతం విస్తరించిన చిన్న, చిన్న పర్వతాలతోను, తూర్పూ కనుమల పార్శ భాగంతోను నిండి ఉంది. జిల్లాలోని విజయవాడ ప్రాంతం విస్తరించి ఉన్న కొండపల్లి పర్వత శ్రేణి 576 మీటర్ల ఎత్తున ఉంది. జిల్లాలో ఉత్తర భాగాన జమ్మన నాయుదుర్గం, విజయవాడలో మొగల్రాజపురం పర్వతం, కనకదుర్గ దేవాలయం ఉన్న ఇంద్ర కిలాద్రి పర్వతం, గాంధీ పర్వతం వంటివి ఉన్నాయి. జిల్లాలో రెండు లోక్ సభ నియోజక వర్గాలు, పూర్తిగాను, మరో రెండు పాక్షికంగాను ఉన్నాయి. 16 శాసన సభ నియోజకవర్గాలు ఉన్నాయి. జిల్లాకు ముఖ్య పట్టణం మచిలీపట్టణం అయితే విజయవాడ వ్యాపార కూడలిగా ఉంది ఉత్తర, దక్షిణ భారత దేశాలను కలిపే ప్రముఖ రైల్వే కూడలిగా ఉంది.కృష్ణా-గుంటూరు జిల్లాలను అనుసంధానం చేసే ప్రకాశం బ్యారేజికి తోడూ మరో వారధిని అవనిగడ్డ ప్రాంతంలోని పులిగడ్డ-రేపల్లె ప్రాంతంలోని పెనుమూడి మధ్య నిర్మింప చేశారు. దీనికి మండలి వెంకట కృష్ణారావు వారధిగా నామకరణం చేశారు. కృష్ణాజిల్లా చరిత్ర మౌర్య చకవర్తుల కాలం నుంచి తెలుస్తోంది. అశోకుని మరణానంతరం శాతవాహనాoధ్రులు కృష్ణా తీరాన శ్రీకాకుళాన్ని (ప్రస్తుతం ఘంటసాల మండలంలో ఉంది) ప్రధమ రాజధానిగా చేసుకుని పాలించారు. శాతవాహనులు తరువాత రాజధానిని ధ్యానకటకానికి మార్చారు. శాతవాహనరాజులు సుమారు 400 సంవత్సరాలు తమ పరిపాలన కొనసాగించారు. ఘంటసాల, గూడూరు, అవనిగడ్డ, రేవుల నుండి రోము, ఇటలి, వంటి దేశాలతో విదేశీ వ్యాపారం జరిగినట్లు చరిత్రను బట్టి తెలుస్తోంది. 1611 లో బందరు లో ఇంగ్లీష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ స్తాపించి వ్యాపారం ప్రారంభించారు. 1794 లో మచిలీపట్టణం కౌన్సిల్ ను రద్దు చేసి కలెక్టర్ల పాలన ప్రవేశ పెట్టారు. దేశ స్వాతంత్ర ఉద్యమంలో జిల్లా వహించిన పాత్ర చరిత్రలో లిఖించదగినది స్వాతంత్రోద్యమ సమయంలో మహాత్మ గాంధీతో పాటు పలువురు జాతీయ నాయకులు కృష్ణ జిల్లాకు విచ్చేసి తమ ప్రసంగాలతో మన జిల్లాకు ఉద్యమ స్పూర్తిని కలిగించారు. భోగ రాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణా రావు, కోలవెన్ను రామ కోటేశ్వరరావు, గొట్టిపాటి బ్రహ్మయ్య, అయ్యాదేవర కాళేశ్వరరావు, మన జాతీయ పతాక రూప శిల్పి పింగళి వెంకయ్య మొదలైన వీరెందరో స్వాతంత్రోద్యమాలతో జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. ఇంతే కాకుండా సాహిత్య రంగంలో కూడా తమదైన శైలిలో ప్రజలను ప్రాభావితం చేసిన అనేక మంది కవులున్నారు. వారిలో ప్రముఖంగా తిరుపతి వెంకట కవులు, విశ్వనాధ సత్యనారాయణ, ఉన్నావా లక్ష్మి నారాయణ వంటి సాహిత్య వేత్తలు ఎన్నో జాతీయ పురస్కారాలు అందుకుని జిల్లాను ప్రముఖ స్తానంలో నిలిపారు.2014 జూన్ 2న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రెండుగా చిలి తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోవడంతో కృష్ణ జిల్లా సిమాంధ్ర లోని 13 జిల్లాలో ఒకటిగా నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కీలక ప్రదేశంగా మారిపోవడం చరిత్రలో ఒక విశేషాoశంగా చెప్పుకోవచ్చు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.